నేర్చుకోవాలి బాబా.. మిస్ యు బాబా..!!

New Phototastic Collage

 

  చాలా నీరసంగా నిరామయంగా మొదలైంది బాబా.. దీపావళి (దానికితోదు వాతావరణం కూడా అలానే ఉంది..తూఫాన్ అంట..) దీపావళి తలనెప్పిగా ఉంది, నెలరోజులుగా వేసుకుంటున్న బీపీ టాబ్లెట్ దాని ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు ఉంది. తల దిమ్ముగా ఉంది, ఈ మధ్య ఫ్రెండ్ ఒకరు సలహా ఇచ్చారు.. “ మీ బాబాయి చనిపోయిన దుఖం మీలో గూడు కట్టుకొని ఉంది, మీరు సరిగ్గా గ్రీవ్ చేసుకోలేకపోయి ఉంటారు, మీరు అనుకున్నది రాయండి, కొంచం తేలిక పడతారేమో “ అని.. మళ్ళీ అందులో కూడా మన స్వార్ధమే ఉన్నా .. నిజమేనేమో అనిపించింది. అందుకే మొదలెడదాం అనుకుంటూ రాస్తున్నా.. తేలికపడుతున్నానో, బరువవుతున్నానో తెలీదు గానీ, రాయకుండా ఉండలేని వొక కంపల్స్హన్ లో రాస్తున్న విషయమిది.

  ఎలా ?? ఎక్కడ నుంచీ మొదలెట్టాలి బాబా… ముఫై ఏళ్ళ జ్ఞాపకాలు. ప్రతీ నిమిషం, మీరు, నేను, పిన్ని గడిపినవి..

 • సరిగా అవగాహన రానప్పుడు, ఇష్టం వచ్చినట్టు మీతో మాట్లాడి, అమ్మతో తిట్లు తింటే.. పోన్లెండి, నేను బాబా ని కాబట్టి చనువుతో అంది, మీరు తిట్టకండి, అని నన్ను వెనకేసుకొని వచ్చిన ప్రేమ గురించి రాయాలా..

 • రెండేళ్ళు బొబ్బిలి లో నేను లేకుండా ఉన్నారని వొకటే ఆడిపోసుకుంటే, నువ్వేమనా నాకు పెళ్లి చేసుకున్నప్పుడు సారె మీద వచ్చావా ? వెళ్ళిన చోట కల్లా తీసుకెళ్లటానికి.. పుల్లంటు బుడ్డీ లా అంటూ..నా ఉక్రోశాన్ని నవ్వుగా మార్చిన మీ అభిమానాన్ని రాయాలా …

 • మాధవిని, భానుని తీసుకొని, జాగ్రత్తగా దీపావళి సామాన్లు కొనిపెట్టి, క్రాకర్ పెన్సిల్స్ కావాలి అని వాడు మారాం చేస్తే, మామూలు పెన్సిళ్ళు ఎన్నైనా కొనుక్కోరా.. కాల్చి పడేసేదానికి, అంత హంగామా డబ్బులు ఎందుకు అంటూ, సున్నితంగానే అయినా , హితవు చెప్పే మిమ్మల్ని గురించి ఏం రాయగలను

 • ఎనిమిది మంది ఆడపిల్లలు, కజిన్స్ వరుసగా పడుకొని ఉంటె, ..ఇంతమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో అని దిగులుపడే మీ అంతులేని ప్రేమ గురించి మాటలే రావటం లేదు..

 • స్కూల్ లో తలంతా పేలు పట్టి, పెద్ద జుత్తు దువ్వుకోలేక, నా అంత జుత్తు కి తలంటి పోయ్యలేక, పిన్ని అవస్థ పడుతుంటే, ఒక స్టూల్ చేయించి, కదలలేని నన్ను దానిమీద కూర్చోబెట్టి, మీరు కుంకుడు రసం పోస్తూ నాకు తలంటి స్నానం చేయించింది.. ఒక రోజా రెండు రోజులా.. కొన్నేళ్ళు .. ఇంకా కళ్ళు మండుతున్నాయి బాబా..

 • వేసుకున్న పోలియో జోళ్ళకి, దానికి ఉన్న తోలు పటకాలకి, కంఫర్ట్ కోసం పెట్టిన ఫోం కి, నల్లులు పట్టేస్తే.. ఇంకో జోళ్ళు చేయించటం కుదరకపోతే, నేను నడవాలని.. ఆ నల్లుల్ని కిరసనాయిల్ లో వేసి చంపి, నేను బాధతో, హ్యుమిలియేషన్ తో విలవిలలాడుతుంటే, నన్ను వోదార్చిన కరుణ.. ఎలా మర్చిపోతాను బాబా ??

 • నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, అని నాకు సంబంధాలు వెతికిన మీ ఈక్వల్ థింకింగ్, నప్పని వొక మేచ్ వస్తే, దానికి రెండు కాళ్ళే కదలలేనివి, మిగతా విషయాలలో, మాకన్నా తెలివైన మంచి మనసు ఉంది.. కుదరదు అని చెప్పేసినప్పుడు, నాకు మీ గురించి కొత్తగా పరిచయం అయింది.

 • నా చేతుల్లో లేని, వొక మనిషి జీవితం గురించి, పతనం గురించి , నేను కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే.. మీరు చెప్పిన వోదార్పు మంత్రం నాతోనే ఉంది బాబా.. ప్రామిస్ చేస్తున్నా, ఇంక ఆ విషయంలో నాకు కన్నీళ్లు రావు..!!

 • వొక్క రోజు సెలవు పెట్టకుండా, ప్లాన్డ్ గా మీ అమ్మాయి పెళ్లి చేసినా. ఉన్నదంతా ధారపోసి అబ్బాయిని విదేశాలకి పంపినా.. మీలో వొక కర్మయోగి ని చూసాను. వాళ్ళు బాగుండాలి, హాయిగా ఉండాలి, మీకు లేని అవకాశాలు వాళ్లకి అందాలి అని మీరు పడిన తపన లో, వొక తండ్రిని, అంతకు మించి వొక మంచి మనిషిని చూసాను.

 • మీరు ఇంకా పెద్ద ఉద్యోగంలో ఉంటె, అమ్మవారి పండుగ దగ్గరగా, ఇంకా పవర్ తో చూసేవాళ్ళం కదా బాబా.. అంటే, చ..చ.. దేవుడి దగ్గర పవర్ అంటూ ఉపయోగించటం ఏమిట్రా పద్మా.. దేవుడే మనకి పవర్ అనుకోవాలి గాని.. అని మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి.

 • వొక సంతకమే కదా బాబా.. పెట్టేస్తే వాళ్ళు మీ జోలికి రారు కదా.. మీరొక్కరూ సరిగ్గా ఉంటె అవినీతి ఆగిపోదు కదా అంటే, “ నిజమే కానీ.. ఆ సంతకం వల్ల నాకు నిద్ర రాదు, వాళ్ళు ఇంకో ఫైల్ రెడీ చేసుకుంటారు “ – అని మీరు చెప్పిన ఎన్నో సంవత్సరాల తర్వాత గాని, కరప్షన్ ప్రెషర్ , టెన్షన్ ఎలా ఉంటాయో అర్ధం కాలేదు..

     • చాలా దుఃఖంగా ఉంది బాబా.. దీపావళి లా కన్నీళ్ళా’వళి లా ఉంది. నాకే ఇలా ఉంటె, పిన్ని కి ఎలా ఉంటుందో మీ కర్ధం అవుతోంది కదా.. ఒక్క వారం రోజులు నా దగ్గర ఉండి, మళ్ళీ వస్తాను అంటూ .. మరి భౌతికంగా తిరిగి రాని లోకాలకి వెళ్లిపోతారని అస్సలు ఊహించలేదు బాబా.. మీరు ఫిజికల్ గా బాధ పడుతున్నారని తెలిసినా, డయాలసిస్ అయితే అవుతుంది మహా.. పాజిటివ్ గా ఆలోచించాలి, హాయిగా ఎలాగో ఒకలాగా.. బ్రతికేయండి అని మిమ్మల్ని అడిగిన మా సాడిజాన్ని క్షమిస్తారు కదూ..

      దేవుడి ముందు మనఃస్పూర్తి గా దణ్ణం పెట్టుకొని..ఏం కోరుకున్నారు అని అడిగితే, గత ముఫై ఏళ్ళు గా, ఏం కోరుకుంటాం.. అందరూ బాగుండాలి, అని చెప్పే మీలాంటి గొప్ప మనసు నేర్చుకొనే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను బాబా..!! అయితే రాసిన జ్ఞాపకాలు గోరంత.. రాయలేని, చేతకాని గాఢమైన విలువలు, జ్ఞాపకాలు ..కొండంత..!!

      మీరు లేని దీపావళి, మనసు శూన్యంగా ఉంది.. మీ జ్ఞాపకాలతో బ్రతికే శక్తిని పిన్నికి, భానుకి, మాధవికి, నాకు.. మా అందరికీ ఇవ్వండి..!!

      మీ

      పద్మ

       

      © Sai Padma:// IPR All Rights Reserved

      ప్రకటనలు

      అమ్మకో ఉత్తరం .. ఈ సీరిస్ లో ఇదే మొదటిది

      amma-2_edited

      ప్రియమైన అమ్మా…
      ఇలాగే గుర్తుండి ఉంటావ్ కదూ నువ్వు.. మీ వాళ్ళందరికీ..చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు, పేషెంట్లు, నువ్వు నచ్చేవాళ్ళు ,నీకు నచ్చేవాళ్ళు.. చిన్న నవ్వుతో, అంతమందిని గెలవగలిగిన నువ్వు.. ఇంక చాల్లే ఈ నవ్వులు అని.. ఈ ఆట వదిలేసి, పొద్దున్నే తీరిగ్గా కాఫీ తాగి , ఈనాడు పజిల్ నింపి.. మమ్మల్ని అందర్నీ వదిలేసి వెళ్లి, ఇవాల్టికి సరిగ్గా నాలుగేళ్ళు
      నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొకపరి తలవండి…. ప్రతీ క్షణం తలచుకుంటున్నాం అమ్మా.. నవ్వే వేళల్లో ఏమిటి? అన్ని వేళల్లోనూ తలచుకున్తున్నాం…కానీ నలుగురు కూర్చోవటం అరుదే.. నీతో పాటు పుట్టిల్లునీ, ఆ మమకారాలనీ పట్టికెళ్ళిపోయావు కదా.. నలుగురం కలుస్తాం.. ఎక్కడో.. రేకు మీద గీసిన ధ్వని లాంటి ఇబ్బంది… చాలా కష్టపడి, నీ ప్రసక్తి, మాటలు , లేకుండా మాట్లాడుతారు. లేదా ఎవరో వొకరు..ఇలా జరిగుండాల్సింది కాదు అంటారు. ఏదో ఇబ్బందిగా ఉంటుంది. నీ మీద కోపం కూడా వస్తుంది.
      అంటే.. ఫర్ సపోజ్ నువ్వు ఎప్పటికీ బ్రతికేస్తావని కాదు.. కానీ..ఇలా ఎలా.. ? ఒక్క మాటైనా చెప్పకుండా, చేయాల్సినవి కొన్ని పనులే అన్నా పూర్తి చేయకుండా ….సన్నజాజులూ, బొమ్మల కొలువులూ , దసరా సరదాలు, గోరింటాకు పచ్చి వాసనలు… నీకేమన్నా దొరుకుతున్నాయా అక్కడ..చాలా చిన్నవాళ్ళూ, పెద్దవాళ్ళూ కూడా చెప్తూనే ఉంటారు..
      ఆత్మ విడిచేసిన చొక్కా లేదా బ్లౌజ్ లాంటిది అని, సోల్ కి చావు అనేది లేదు అని.. విడిచేసావు సరే.. ఈ ప్రపంచంలో ఏదో ఎక్కడో వొకటి మళ్ళీ ఇంకో వేషంలోనో, ఇంకెవరికో ఇంకేదో గా ఉన్నావా..? విచిత్రంగా లేదూ.. సోల్ కి చావు లేదన్నవాళ్ళు కూడా.. ఆ సోల్ ని ఫీల్ కాక పోవటం..!
      నాకైతే, ఒకందుకు సుఖంగా ఉంటుంది అమ్మా… ఇదే శరీరపు ఇరుకుతనంతో , ఇదే మనుషుల ముసుగుల మధ్య సగం నవ్వులతో బ్రతకక్కర లేదు. నీకు నచ్చిన వాళ్ళు, నువ్వు ప్రేమించినవాళ్ళు అనుభవించే డైలీ నరకం నువ్వు చూడక్కరలేదు… వోకరకంగా ఎన్నారై జీవితం అనుకో.. అన్నీ శుభవార్తలే .. టేలీగ్రాం అంటే భయపడే దుఖపు వార్తలా.. అప్పుడప్పుడూ కలిసే మనిషికి చెప్పే అందమైన అబద్ధంలా ..!!
      కానీ అమ్మా.. నేను కట్టని/ కట్టలేని చిన్న అరుగుల ఇల్లు, నీ కోసం పొందిగ్గా సమకూర్చని లైబ్రరీ.. వేయని సన్నజాజి పొద, మనం చెప్పుకొని నవ్వని కబుర్లు .. నువ్వు లేక నన్ను పలకరించే నీ స్నేహితులు.. నీ నవ్వుల వెనుక నిశ్చబ్దం.. అదే నిశ్చబ్దాన్ని అంగీకారంగా భావించే మనుషలని నువ్వు భరించిన వైనం..
      నన్నెప్పటికీ గిల్టీనెస్ వైపు తోస్తూనే ఉంటాయి .. ఎప్పటికీ తోస్తూనే ఉంటాయి..
      నీ
      పద్మ

      © Sai Padma ://IPR All Rights Reserved

      అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ’జాలం- సూఫీ చెప్పిన కథ-సాయి పద్మ రివ్యూ

      download

      శ్రీ కే.పీ.రామనున్ని రాసిన “ సూఫీ పరాంజే కథ’ ( మలయాళంలో ఈ నవల పేరు ) ని తెలుగులో శ్రీ. ఎల్.ఆర్ .స్వామి గారు ‘సూఫీ చెప్పిన కథ’ గా అనువాదం చేసారు . అది ఇప్పుడే చదివి ముగించాను . లేదు .. లేదు గత పదిహేను రోజులుగా ముందుకీ , వెనక్కీ చదువుతూనే ఉన్నాను . కథలోకి పూర్తిగా ములగబోయే ముందు కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి – ఈ కథ కి గాను రచయిత రామనున్ని గారికి కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు, వయలార్ అవార్డు మరిన్ని అవార్డులు , రివార్డులు వచ్చాయి. దీన్ని సినిమాగా కూడా తీసారు. సుప్రసిద్ధ రచయిత శ్రీ ఎల్. ఆర్ .స్వామి గారు అనువాదం చేయగా, సారంగ బుక్స్ వారు దీన్ని పబ్లిష్ చేసారు . హమ్మయ్య.. వివరాలు చెప్పేసాను కాబట్టి, ఇక కథలోకి వెళ్దాం.

      సమీక్షకురాలి ముందు మాట : ఈ మధ్య కాలంలో నన్ను ప్రభావితం చేసిన రచనగా నేను దీన్ని చెప్పుకోవచ్చు. కథనీ , హేతువాదాన్నీ, సూఫీ లాంటి ఒక మిస్టిక్ తత్వాన్నీ పక్కన పెడితే, స్త్రీత్వాన్ని గురించీ, లాజిక్కీ , రీజన్ కీ అందని మనిషి బలహీనతల గురించి, బలమైన మెటాఫర్ ల ద్వారా చెప్పిన కథ ఇది . ఈ రివ్యూ లో అభిప్రాయాలు, ఇష్టాలూ, అయిష్టాలూ అన్నీ నావే. నాకు అర్ధమైనంతవరకూ రాసుకున్న ఈ రివ్యూ ని మీకందరికీ నచ్చుతుందని , కొన్ని కోణాలు తెలుగు సాహిత్య లోకం అర్ధం చేసుకుంటుందని అనువాదకులు నిజాయితీ గా చేసిన ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను.

      క్లుప్తంగా కథ: పొన్నాని గ్రామంలో వెలసిన ఒక బీవి హిందూ, ముస్లిం మతస్తులతో సమానంగా పూజలు అందుకుంటోంది అనే ఒక పద చిత్రంతో ఈ కథ మొదలవుతుంది . అక్కడ ఆ బీవి జలసమాధి అయిన చోట ఒక దర్గా ఉంటుంది. కేరళలో ప్రసిద్ధమైన ఒక మీనోన్ ల తరవాడు (ఇంట)న పుట్టిన ఒక సౌందర్య శక్తి రూపం కార్తి కథ ఇది . నిజానికి ఈ కార్తి మనిషి లోని సౌందర్య దాహానికి, శక్తికీ , స్వచ్చతకీ ప్రతీక. కార్తి పుట్టగానే జాతకం చూసిన మావయ్య శంకు మీనోన్ అన్య కులస్తుడితో సహవాసం చేసి , తరవాడు వదిలి వెళ్ళిపోతుంది అని తెలుసుకుంటాడు. అయినప్పటికీ, దిన దిన ప్రవర్ధమానమవుతున్న మేనకోడలి సౌందర్యానికీ, అందులోని శక్తికీ శలభం లాగా , దగ్గరవుతూ, దూరమవుతూ దోలాయమానం గా ఉంటాడు. ఇంట్లో ఉన్న ఆకర్షణ కి లోలం అవుతూ ఉంటాడు . ఆమెకి నెమ్మదిగా మానసికంగా ఒక రక్షకునిగా మారతాడు. అదే సమయంలో వ్యాపార నిమిత్తం వచ్చిన ముస్లిం వ్యాపారి మమ్ముటి తో కార్తి సన్నిహితం కావటాన్ని నిస్సహాయంగా గమనిస్తాడు. ఆమె, అతనితో వెళ్ళిపోతుంది అని ఊహించి , మనసుకీ , శరీరానికీ సంకెళ్ళు వేసుకొని , కార్తి ని గడప దాటనిస్తాడు. సర్వస్వం కోల్పోయిన వాడిగా మిగులుతాడు. మమ్ముటి తో సంగమించి పొన్నాని గ్రామం చేరుతుంది కార్తి. మతం మార్చుకొని అతను పెళ్లాడని అతని భార్యగా, సహజీవనం చేస్తూ , అతని కుటుంబం తో ఉంటుంది . హిందూ అయిన కార్తిని, తెలీకుండానే ఒక ఆరాధ్య భావంతో చూస్తుంది మమ్ముటి చెల్లెలు అయేషా . కార్తి ముస్లిం లోకి మతం మార్చుకుంటుంది. కానీ జన్మతః వచ్చిన హిందూయిజాన్ని మరువలేకపోతుంది. దేవతా విగ్రహం మమ్ముటి ఇంట్లో దొరకగానే , దానికి పూజలు ప్రారంభిస్తుంది . భార్య మీద ఇష్టంతో ఇంట్లోనే గుడి కట్టిస్తాడు మమ్ముటి. దానితో, వూరు మమ్ముటి ని వదులుకోలేక, అతను చేసిన పనిని ఇష్టపడలేక, ఒకానొక మత సందేహాలతో , సతమతమవుతుంది. కార్తి, సౌందర్యాన్ని, దానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని, ఆపదల్ల్లో ఆమె చూపించిన శక్తిని కళ్ళారా చూసిన మమ్ముటి , ఒక సంశయం నిండిన ఆత్మ న్యూనత కి గురి అవుతాడు. దైహికంగా, మానసికంగా కార్తి మళ్ళీ వొంటరిదవుతుంది. తన న్యూనతతో, ఆమెకి శారీరకంగా దూరమవుతూ , తనని తానే హింసించుకుంటూ వికృత చర్యలకి పాల్పడతాడు.ద్వేషించినా, ప్రేమించినా, కామించినా మనఃస్పూర్తిగా మాత్రమే చేయగల కార్తి జలసమాధి అయి .. బీవీ గామారి, పొన్నాని ప్రజల్ని రక్షిస్తూ ఉంటుంది.

      కథలో నాకు నచ్చిన అంశాలు :

      · భాష: అనువాదం ఎంత బాగుంది అంటే, మనం ఊహించని ఎన్నో కోణాల్లో వర్ణన సాగుతుంది. కవితాత్మక వచనం ఉండాలా వద్దా , మెటాఫర్ అనేది ఎక్కడ ఉండాలి అనే సందేహాలు … కడలి పొరల్లా ఒకటీ ఒకటీ విడిపోయి దారిచ్చినట్టు గా ఉంటాయి

      · మనిషి జీవితం హేతువాదానికి అతీతం . అది మార్మికం కావచ్చు, మరేదన్నా మతం కావచ్చు. ప్యూర్ గా ఇది ఇక్కడినుంచే మొదలైంది. ఈ మతంలో మరే విషయం కలవలేదు అని చెప్పటం సాధ్యం కాదు.

      · మానవ జాతిని నడిపించేది ఒకే ఒక మూల సూత్రం . దాని ఆధారంగానే మతాలు ఏర్పడ్డాయి. అవసరం కొద్దీ, బలహీనతల కొద్దీ అవి శృంఖలాలు గా మారాయి.

      · ఆడదాని సౌందర్యం కన్నా …మగవాళ్ళని, మగ ఆలోచనలని , ప్రలోభపెట్టి , భయపెట్టేది .. స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసం, గిల్ట్ లేని వాళ్ళ సెక్సువాలిటీ ..!

      · భాష వ్యక్తీకరణ లోని bondages ని చేదించ వలసిన అవసరం ఎంతైనా ఉంది

      · ప్రకృతి , సహజీవనం కన్నా గొప్ప మెటాఫర్ లేదు

      · సాహిత్యానికీ, భాషకీ .. కేవలం అనుభూతి మాత్రమే కాదు.. ఆఘ్రాణశక్తి కూడా ఉంది. ఈ కథలో , కడలి తీరం, ఉప్పు గాలి, చెమట వాసన , తరవాడు వంశాచారాల వదుల్చుకోలేని మశూచి , కార్తి సౌందర్యపు నిర్లజ్జా విత్తనాలు .. మన మనసులో సజీవంగా ఉంటాయి .

      · కథంతా ఈ మెటాఫర్ ని మనం అనుభవిస్తూనే ఉంటాము.

      నచ్చిన కొన్ని కవితాత్మక వాక్యాలు:

      · ఒక నూతన వూహ మొక్క చిగురైనా భూమిపైకి పొడుచుకు రావటం మీరు వోప్పుకోరా ?

      · పాతకక్షలేవో తీర్చుకోవటానికే అన్నట్లు ఆకాశంలో ఎదిగి ఎదిగి పగిలి పడిపోయిన మబ్బుల స్తంభాలు మా సముద్ర తీరాన్ని కొరికి మింగేసాయి.

      · దర్గాలో చిరువేచ్చని నూనెలో కాళ్ళు చేతులు కొట్టుకొని అనుభావమండిన నేను ఒక పసిపిల్లవాడిగా మారాను.

      · పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఒక ఫలప్రదమైన మెట్టు ఎక్కినట్లు తోచింది; ఆ ఇంటి వారికి

      · స్మృతి యొక్క రసాయనిక విశ్లేషణ వదిలిన పొగగా అది , ఆత్మలో చేరి నాచు కట్టింది.

      · ఐశ్వర్యానికి గతకాలపు ఆలోచనలు ఉండవు. నువ్వు నది దాటి వచ్చిన వాడివి.

      · ఏడవాలని అనుకున్నప్పుడు ఏడవటం, స్నేహించాలని అనుకున్నప్పుడు స్నేహించటం, కామించాలని అనుకున్నప్పుడు కామించటం ఆమె కి సాధ్యమే… ఆమెకి ఆ ధైర్యం ఉంది .

      హిస్టరీని , మన మూలాల మిస్టరీని కలిపి రాసిన ఈ కథ , అనువాదం రెండూ గొప్పగా ఉన్నాయి . హిందూ, ముస్లిం మతాల లోని సదాచారాల, దురాచారాల మూలాలు కొన్ని తెలుసుకున్నప్పుడు , అంతా ఒకటే కదా , అయినప్పటికీ ఎంత రక్త పాతం, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని కోరికల కొత్త సమాధులో కదా..!! హ్మ్మ్ ..!

      ఈ కథలో అర్ధమైన మరో కోణం, స్త్రీ తన సెక్సువాలిటీ ని ఏ సందేహమూ లేకుండా అక్సేప్ట్ చేసి, explore చేసిన మాతృ స్వామిక సమాజాల లో కూడా పురుషునికి నీడగా మారని స్త్రీ నీ, ఆమె ఆత్మ విశ్వాసాన్నీ , పురుషుడు సందేహిస్తూ , ఆమెని మరింత వొంటరితనం లోకి నేట్టేస్తూనే ఉన్నాడు ..!

      మొత్తానికి.. ఈ అనువాద నవల మన అణువణువులో వెదజల్లిన సాహిత్యపు, కవితా విత్తనాలు మాత్రం నివురులాంటి చివురులు వేయటం .. కథల్లో మెటాఫర్ ప్రయోగం పట్ల నాకు అంతులేని ప్రేమా, సాహిత్య ప్రయోజనం ఒక కార్తి అనే బీవి వల్ల ఏర్పడింది ..అనేది మాత్రం నిర్వివాదాంశం…!!

      Lastly, the identity/genesis/purity of a religion or any form of practice.. Stood on its glorious ground without much constructive debate as long as it’s based on equality and on the foundation of humanity.. When there are cracks in such foundation by curtailing naturalness of human desires by hiding their weaknesses and portraying their fake strengths … there looms collapse of any religion which leaves room for world class literature… Ironically..!!

      ప్రముఖ అనువాదకులు స్వామి గారికి నా అభినందనలూ, ధన్యవాదాలు కూడా ..! సారంగ బుక్స్ వాళ్ళు వేసిన ఈ పుస్తకం నవోదయ షాప్స్ అన్నిట్లో దొరుకుతోంది . వెల 75 రూపాయలు.

      –సాయి పద్మ

      ( ఈ రివ్యూ మాలిక పత్రికలో వచ్చింది. ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే, ఈ అనువాదానికి గాను ఎల్. ఆర్ .స్వామి గారికి, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంతకంటే , శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలీక…)

      స్వామి గారికి మనః పూర్వక శుభాకాంక్షలు..!!

      మీ

      సాయి పద్మ

      © Sai Padma :// IPR All Rights Reserved

      అత్తమ్మ అంబేద్కర్ లా ఉంది ..!!

      frame_edited

       

      ఈ మాట నాది కాదు, వినోదిని గారి కథల్లో ఒక కథ టైటిల్ ఇది ..

      ఇవాళ మా అత్తయ్య పోయిన రోజు, ఆమె చెప్పిన చివరి మాట- ఆనంద్ వచ్చేస్తాడు, తలుపులు జాగ్రత్తగా వేసుకో ..నా గురించి బాధ వద్దు ..!

      ఆలోచిస్తే, తక్కువకాలంలో ఆమె చెప్పినవి , వొక జీవితకాలానికి సరిపోయినన్ని….

      ఉదాహరణకి కొన్ని

      నేను:సోనియాగాంధీ పరిపాలిస్తోంది అత్తయ్యా –

      అత్తయ్య: అంటే, అమ్మా, బాత్రూంలు కదిగేవాళ్ళు కూడా ఇటలీ నుండే వస్తారా ఇంక ..!

      నే:పోనీలెండి అత్తయ్యా, కీర్తి కోసమే కదా వాళ్ళ బాధ ..

      అ: ఇదిగో పద్మా, ఏ కాంక్ష అన్నా వయసుతో పాటు తగ్గే అవకాశం ఉంది… కీర్తి కాంక్ష ఉన్నవాళ్ళతో చాలా కష్టం.. వయసు పెరిగే కొద్దీ అది పెరుగుతూ ప్రక్కవాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

      నే: మేరేదన్నా మిస్ అయ్యారా అత్తయ్యా

      అ: మొగుడ్ని భరించటంలో, పిల్లల్ని పెంచటంలో సగం పైగా ఆడవాళ్ళు జీవితమే మిస్ అవుతారు, అది వదిలేయి గానీ.. అంబేద్కర్ బ్రతికుండి, ఆ వుమన్ బిల్ చట్టం వచ్చేసి ఉంటె బాగుండేది అమ్మాయ్

      నే: ఏ స్వేచ్ఛ ముఖ్యం.. అర్దికమా, లైంగికమా, సాంఘిక స్వేచ్ఛ నా

      అ: మానసికం. ముందు మేము తక్కువ అనో, వేరే వాళ్ళని ఫాలో అవుదాం అనో కాక మనల్ని మనంగా ప్రేమించుకుంటే వచ్చే స్వేచ్ఛ. మిగిలిపోయిన అన్నం మనమే తిని, మొగుడు తిన్న పళ్ళెం మనసులో తిట్టుకుంటూ తీయకుండా ఉండే స్వేచ్ఛ. ఇష్టం ఉండి ఏదన్నా చేయమను.. అది డ్యూటీ గా చెప్తే విని భయపడని స్వేచ్ఛ ..!

      నే: ఆనంద్ లేడు, ఇవాళ కూడా అన్నీ వండాలా అత్తయ్యా ..

      అ: ఎమమ్మాయి, ఆయనేమన్నా నీ పొట్ట కూడా కేంప్ కి తీసుకెళ్లాడా .. మనిద్దరం లేమూ

      నే: వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకేం అనిపిస్తుంది.

      అ: అదేంటి పద్మా, అలా అంటావు ? వొకప్పుడు నా పెద్ద కొడుకు, టెన్త్ పాసయి, వొక ఉద్యోగం వస్తే చాలు ఈ కష్టాలు తీరతాయి అనుకున్న నేను, అతన్ని డాక్టర్ని చేసాను. నా కూతురుని ప్రధానోపాధ్యాయురాలిని, ఇక మీ ఆయన్ని, విలువలతో కూడిన వొక సామాజిక కార్యకర్త గా చేసాను. నా ప్రతీ గాయం, అవమానం వాళ్ళకి అవకాశంగా మలిచాను. నాకు బోల్డు హేపీ

      నే: వాళ్ళు బాగా చదువుకోవటమేనా మీకు పెద్ద రివార్డ్ ?

      అ: కాదు, కాదు.. అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయిన నా పెద్ద కోడలు, నన్ను తన ఆఫీసుకి తీసుకెళ్ళి.. అంతమంది ముందు “ నేను ఇంత ప్రశాంతంగా , హాయిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఉద్యోగం చేస్తున్నానంటే కారణం.. మా అత్తగారు “ అని చెప్పింది. భలే సిగ్గేసింది పద్మా.. కొంచం గర్వంగా అనిపించింది అనుకో.. ఐదో తరగతి చదివి, పదమూడేళ్ళకి పెళ్లి చేసుకొని పదిహేనుకే బిడ్డ తల్లయిన నాకు ..ఇంకేం కావాలి పద్మా ??

      వొక జీవితానుభవం వల్ల కళ్ళు చేమ్మగిల్లటం అంటే ఏమిటో నాకు అర్ధం అయింది..

      మా అత్తయ్య నాకు అంబేద్కర్లానే అర్ధం అవుతూ అవుతోంది ..!!

      హాయిగా ఉండండి అత్తయ్యా .. !!

      మీ

      పద్మ , నందు 6facbda5-e679-4055-982b-a814fa05d4cd

       

      © Sai Padma:// IPR All Rights Reserved

      జ్ఞాపకాలే వోదార్పు.. జ్ఞాపకాలే నిట్టూర్పు ..!!

      New Microsoft PowerPoint Presentation

      నిరామయంగా నిలబడ్డ మాట్లాడని మల్లెమొగ్గ, కదలలేని మెదలలేని వొక జీవితం .. వోకటికీ , రెంటికీ కూడా మంచంలో జరపాల్సిన  పిల్లని కూడా ఏనాడూ విసుక్కోలేదు.. !

      గుర్తుందా అమ్మా..గాలీ వానలో , మా స్కూల్ పాక కూలిపోయి నేను, ఇంకో టీచర్ అందులో గంటకి పైగా సేపు ఉండిపోతే, .. ముందుగా నన్ను కాపాడిన భాషా మేడం కి నువ్వు అన్ని టెస్ట్లూ ఫ్రీ గా చేస్తే, నన్ను పట్టించుకోలేదని విసుక్కున్నా.. ఆమె ప్రేగ్నంట్ రా .. నిన్ను నాకిచ్చిన ఆవిడని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పు ..? అని నువ్వు బుజ్జగించిన వైనం .. సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అని చెప్పిన ఎన్నో పాఠాల కన్నా, కీర్తికాంక్ష తో కాలిపోయిన , కూలిపోతున్న ఎంతో మంది మనుషుల కన్నా మిన్న.. !

      ఎవరు చెప్పారు? ఇవాళ చస్తే రేపటికి రెండని .. అవన్నీ పిచ్చి సామెతలు అమ్మా.. వొక్కరోజు కూడా నిన్ను తలవకుండా జరగటం లేదు .. రేపటితో మూడేళ్ళా ..?

      నాకైతే ఏమీ బాగా లేదు అమ్మా.. ఎంత టేక్ ఇట్ for గ్రాంటెడ్ గా గడిపేశాం రోజులు.. వచ్చిన ప్రతీ చెత్త సినిమా చూస్తూ .. నీ పనిలో నువ్వు.. సగం మూసిన డైరీ కాగితాలు. మధ్యలో పెట్టిన పాత రూపాయి ప్లాస్టిక్ పెన్ను .. తప్పకుండా దాని మూత ఎక్కడో తప్పిపోయే ఉండాలి .. హ హ ..!

      నువ్వు లేని, వెళ్ళలేని ఇల్లు.. ( మళ్ళీ దానికో సామెత చెప్తావు.. తల్లి ఉన్నంతవరకే పుట్టిల్లు, పాలున్నంత వరకే పరమాన్నం అని )… అదే ఇల్లు, తాళాలేసుకుంటూ గడిపెసావు అన్ని సంవత్సరాలూ.. నీకు తెలుసా .. మళ్ళీ నెప్పి లేకుండా నడుస్తున్నానని.. ఆనంద్ , నిట్టూరుస్తున్నాడు .. “ అనవసరంగా, నిన్ను పాపలా చూసుకుంటాను అని ఆమెకి చెప్పాను.. నిష్పూచీగా ఆమె వెళ్ళిపోయారు అని..” నీకు ప్రామిస్ చేసిన విధంగా చంటిపిల్లలాగే చూసుకుంటున్నాడు.

      మళ్ళీ సంగీతం మొదలెట్టానని, హిందుస్తానీ నేర్చుకుంటున్నానని .. నీకేమైనా పడుతోందా అసలు ..! చాలా ఉక్కపోతగా ఉంది అమ్మా.. మారే విలువలు , వాళ్ళే విడదీసుకుంటున్న వాసనా గంధాలు .. ఎలా మారతారు మనుషులు? మళ్ళీ దానికో సామెత చెప్పకు .. “ పారకపోతే నీరు, మారకపోతే మనిషీ !” అని ..!

      వొక్కోసారి గాభరాగా ఉంటుంది అమ్మా.. సునామీ వచ్చి వెళ్ళిన తర్వాత , బోడిగా ఉన్న మొక్కల్ని చూసి .. ఏడుపు లాంటి మూలుగు వస్తుంది చూడు.. అలా అనిపిస్తుంది వొంటరిగా.. !

      డిప్రెషన్ తో బాధ పడుతున్న వాళ్లకి, ఆల్కహాలిక్స్ ఫెమిలీస్ కీ ..మనం సపోర్ట్ చేయాలిరా అనేదానివి .. కొంచం కూడా సపోర్ట్ లేకుండా ఎలా చేయగలను అనుకున్నావు ఇన్ని పనులు ?

      పిన్నిలందరూ కొత్త కొత్త చీరలు కొనుక్కుంటున్నారు .. వాళ్ళ పిల్లల కోసం అమెరికా, ఆస్టేలియా, వెళ్లి వస్తున్నారు .. నువ్వు కలలోకి కూడా రావటం లేదు.. నేను తిడతానని భయం ఏమో .. !

      నా ఫ్రెండ్స్ ఎవరూ నీకు తెలియటం లేదు, అనేదానివి .. ఇప్పుడు ఇంకా బోల్డు మంది ఫ్రెండ్స్ అయ్యారు.. ఎలా పరిచయం చేసుకుంటావు ..?

      కేవలం కర్మ సిద్ధాంతం నమ్మే, మొగుడూ పిల్లల్ని , పనిని ప్రేమించే నీలాంటి ఆడవాళ్ళని ప్రేమించటం నాదే బుద్ది తక్కువ .. నాకిలా కావలసిందేలే ..!!

      నువ్వెక్కడున్నా హాయిగా ఉండు.. మనసున మల్లెల మాలలూగెనే అని పాడుకుంటూ.. ఎలాగూ.. భానుమతి నాసల్ గొంతుని వెక్కిరించటానికి , నేను పక్కన లేనుగా… !!

      –సాయి పద్మ

      భావం – ప్రాప్తి

      gasp-jindra-noewi

      కాస్త వంగి నడు, ఛాతీ కనబడేలా ఆ నడకేంటి

      కాళ్ళు బారజాపి అంగలేస్తూ , ఎలా ఉన్నావో తెలుసా ..మగరాయుడిలా

      వోద్దిగ్గా కూర్చోలేవూ.. ఆడ పిల్లవు కావూ

      వినీ వినీ విసుగేత్తిపోతోంది ప్రాణం

      ఎందుకు సిగ్గుపడాలి శరీరం అంటే ..

      నరాల, నాడుల, స్పర్శల, అనుభూతుల

      శరీరం అంటే ..

      నిప్పుల్లాంటి నెప్పుల, మెలికల, ముడతల, బిగుతుల, వదుల్ల

      శరీరం అంటే..

      ఆశ, నిరాశల, భావాల, ప్రాప్తుల

      శరీరం అంటే

      వినేవాళ్ళుంటే, ఆచరించేవాళ్ళుంటే

      ఎంతసేపు సిగ్గుపడాలో, ఎలా మడుచుకొని పడుకోవాలో

      కూడా చెప్తారు, ఏ బట్టలేసుకొని తిరగాలో చెప్పినట్టు

      ఎంత ఫ్రెష్ గా నటిస్తే , అంత డిమాండ్ పిల్లా

      అనేది మా ఖాదర్ లక్ష్మి

      అదే లైసెన్సుడ్ వ్యభిచారాల్లో

      తొడల మీద చారలూ, చేసిన అత్యాచారాలూ

      అంతే కన్వీనియెంట్గా మానిపోతాయి

      మధురవాణులూ , చలాలూ, యెంత గింజుకున్నా

      శరీరాలకి వ్యాయామం కాదు కదా ..

      శరీరాన్ని ప్రేమించాలని కూడా అనుకోం ..

      మళ్ళీ ఎక్కడ వదులై పోతే , వలచినవాడు

      వేరే పోతాడని భయం ..

      అన్నీ భయం.. అంతా భయం ..!

      ఎవరో ఏదో అంటారని, మడతల కొద్దీ గుడ్డల వెనుక

      అస్తిత్వాన్ని కప్పేసి అస్థిపంజరంలా మిగిలిపోతాం

      ఇంతకీ అస్తిపంజరాలకి భావప్రాప్తి ఉంటుందంటావా ..

      సగం పెళ్ళిళ్ళల్లా అది కూడా ఫేక్ ఆర్గాజమేనా ..?

      –సాయి పద్మ

      © Sai Padma IPR:// All Rights Reserved

      డిప్రెషన్- కాలిన ఇళ్ళ కలల చిట్టా

      IMG-20150121-WA0002

      డిప్రెషన్

      తాటాకులు కాలిన కమురు వాసనలో, కాలుతున్న కుండలూ , కూలుతున్న ఆశలూ కనబడవు. లగేత్తు లగేత్తు.. ప్రాణం ముఖ్యం, పాస్ పుస్తకాలూ.. పట్టా కాగితాలూ కావు ..! అక్కడ ఎవరు తగలపడినా ..ఎక్కడ ఎవరు దగా పడినా ..నడు రోడ్ మీదకి.. పాలంబలి కాకపోతే నీళ్ళ అంబలి ..అదీ పులిస్తే, గంజినీళ్ళు , ఏదో ఒకటి ప్రాణం ముఖ్యం , కరిగిపోయిన నీ సత్తు గిన్నెలు కాదు .. లగెత్తేహే!!

      కలవారి భోగి మంటల్లో, కాలిన టేకు ముక్కలు కాదు.. వాళ్ళు తిని వదిలేసిన కేకు ముక్కలూ కావు .. పేకముక్కల్లా కనబడినా .. పేల్లై… జీర్ణించి రాలిన తాటిపట్టలురా .. నిత్యం అబద్ధాలాడే నాలికలంత నాణ్యమైనవీ .. లౌక్యమైనవీ .. స్వచ్ఛమైనవీ కావు ..!! నానీ నానీ జీర్ణించి ..ఆత్మాహుతి చేసుకున్న నీ మాన మర్యాదలు.. ఏది ఏమైనా ప్రాణం ముఖ్యం .. పరిగెత్తు ..సగం కాలిన లంగాలూ.. బిగించని గోచీలూ .. బిడియం అనవసరం ..పరిగెత్తు!!

      కొండగాలి తిరిగిందీ…అని పాడుకొనే పాటలు మనకోద్దేహే .. ఇక్కడ మనుషులు ఎవరూ లేరు ..నిత్యం చస్తున్న నీకోసం ఏడవటానికి .. ఇక్కడున్నదంతా ..మగాళ్ళూ, ఆడాళ్ళూ, అగ్రకులాల వాళ్ళూ,దళితులూ, పాపులూ, పునీతలూ.. కొండొకచో విలువల షరాబులూ , మిగతా అంతా బ్రోకర్లే.. !!

      పొగమంచు విడని చిక్కటి శీతాకాలపు పొద్దు .. తాటాకు వాసన వేన్నీళ్ళు , వీడని నిద్ర కళ్ళూ, నిద్ర వాసనేస్తున్న దుప్పట్లూ, పక్కబట్టలూ, ముఖాలూ.. అంతలో తాటాకుల మంట కావిలించుకొని, పొగతో నలిపెస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా ? ఒక ముద్దేట్టి నిద్ర లేపే అమ్మో, నాన్నో.. ఛీ కొట్టినట్టు , ఊపిరాడని వేదనేదో లుంగ చుట్టి .. కాళ్ళూ చేతులూ కట్టి మంటల్లో తోసేసినట్టు .. అయినా ప్రాణం ముఖ్యంరా .. పరిగెత్తు..!!

      కాలిపోయిన ఇళ్ళ కోసం, దొరికే నలిగిపోయిన నోటు ముక్కలకోసం , ముక్కలై పోయిన వోటరు కార్డులూ, ఆధార్ కార్డులూ పట్టుకొని, తెల్లారి పాచిమొహాలతో గుక్కెడు టీ చుక్కలతో సరిపెట్టుకొని, ఇంకా ముఖాలు కడగని చెట్ల మధ్య, శుభ్రంగా స్నానం చేసి , ఏసీ లేదని విసుక్కొనే మనుష్యుల మధ్య ఎలా ఉంటుందో తెలుసా .. కాలిన మృత శిశువు దేహం , కమురు వాసన ,, చినిగిన బట్టల మధ్య నగ్నంగా నడుస్తున్నట్లు .. నడక చాలదు నాన్నా .. ప్రాణం ముఖ్యం .. పరిగెత్తు పరిగెత్తు ..

      ఈ మనుష్యుల నుండీ ..వీళ్ళ వర్గాల నుండీ .. రూపాయి ఇచ్చి, మైలేజీ కావాలనుకొనే మార్కెటింగ్ కవరేజీల నుండీ .. పరిగెత్తు .. బాగా పరిగెత్తు ..

      ప్రాణం పోయినా పర్లేదు .. శాంతి ముఖ్యం…. పరిగెత్తు .. లోపలికి.. ఇంకా లోపలికి లగేత్తు ..!!

      –సాయి పద్మ

      ©  Sai Padma :// IPR All Rights Reserved

      పద్దాలు – పైడమ్మ ………….. అనబడు ఖబరం రసీద …. The Unfinished Symphony

      10696343_10152751203243308_8023569219321876877_n

      ఒక్కసారి కూడా చూడని మనిషి కోసం బాధ పడటం ఏంటి? బుద్ధి తక్కువ కాకపోతే..

      గత నెల ఫోన్ చేస్తే .. లేదు లేదు అంటూనే, చేదు లోనే శాంతి ఉంది, అన్నాడు ఆరుద్ర అని మీరంటే , ఉంది ఉంది అనుకుంటే , మన చేతుల్లోనే ఆరోగ్యం ఉంది – అని నేనంటే, తల్లీ నువ్వు కూడా క్లాసులు పీకటం మొదలెట్టావా ? అన్న గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది.

      మీరో గొప్ప కవి అని తెలీక, నా పిచ్చి రాతల్ని, దళిత కవిత్వం మీద , మనుషుల మీద నా అభిప్రాయాల్ని, సంగీతాన్ని, రాగాల్ని, మనుషుల రోగాల్ని… వాట్ నాట్ ..మాట్లాడుకొని విషయం ఏమన్నా ఉందా అసలు ..చుప్ కే చుప్ కే రాత్ దిన్ ..!!

      కుహనా మనుషుల్ని నమ్మద్దురొరేయ్ పద్దాలూ… అని ఎవరు చెప్తారు ఇప్పుడు..? మా పిన్ని తర్వాత అలా అభిమానంగా పిలిచింది మీరేనండీ అంటే.. మరి నేను పైడమ్మ ని కదా.. మట్టోసన వోగుల్తాదేటండీ అని నవ్విన నవ్వు ఇంకా చిక్కగా ఎక్కడో, ఇక్కడే ఎక్కడో చిక్కుకొనే ఉంది..!

      దుఃఖంగా ఉంది పైడమ్మా.. కోపంగా కూడా ఉంది …

      ఖబరం రసీదా.. కోక్ స్టూడియో.. ఇప్పుడు నాకొక వన్ లార్జ్ తెరేష్ గారు కావాలంటే .. తెచ్చివ్వగలరా..

      దేవుడ్ని నమ్మకపోయినా , భార్య కోసం, షిర్డీ సాయి కి దణ్ణం పెట్టిన .. ఆ ప్రేమికుడ్ని తెచ్చివ్వగలరా

      మెడలు పట్టుకొని ఊగే, సాయి రీతి, ప్రణయ్ లకు… కొండంత ఫ్రెండుని తెచ్చివ్వగలరా

      మీకోసం, తన ఊరిని, వాడని, ధర్మాన్ని వదిలేసి వచ్చి, నా ప్రాణం తెరేష్ అని చెప్పగలిగిన భార్యకి.. .. అంతటి గొప్ప స్నేహితుడ్ని మళ్ళా ఎవరు తెచ్చిస్తారు ?

      తాజ్ మహల్ ముందు ముంతాజ్ ని తలచుకొని కన్నీరిడిన మనిషి, చుండూరు వూచకోతల్ని .. అక్షరాల క్షారాల తో, కడిగేసి… కుహనా మనుషుల్ని, రాజకీయాల్ని అశ్శరభ శరభ అనిపించిన మనిషి..

      ఒక చేవేజ్ ని, ఒక నామదేవ్ ధసాల్ ని, ఒక మంచి వాక్యం రాసే ప్రతీ మనిషినీ .. అంతే ఉత్సాహంతో, నాలాంటి కొత్త అక్షర బిచ్చగాళ్ళ కి పరిచయం చేసిన ఆ మనసు మళ్ళా ఎవరికొస్తుంది?

      మీరు లేరని మోహన్ రిషి మెస్సేజ్ పెడితే నమ్మలేక పోయాను.. మొన్ననే కదా… అతన్ని, వంశీధర్ రెడ్డి కవిత్వాన్ని .. దగ్గొచ్చే దాకా పొగిడారు ..!

      అర్జంటుగా నీ కవితలు పంపించు.. అవి పుస్తకం రావాలి అని బుర్ర తిన్నారు .. మంచి పద్యం నువ్వు చూడు.. మిగతావి అన్నీ అవుతాయి అన్న మీరు ..అప్పుడే ఎలా మిడిల్ డ్రాప్ చేయగలిగారు ..

      డాన్స్ మి టు మై సాంగ్ .. సినిమా తప్పక చూడు పద్దాలు… అని చెప్పారు..!

      కానీ ..కోపం మాత్రం తగ్గటం లేదు పైడమ్మా ..మీకసలు బుద్ది లేదంటే లేదు ..నేనయితే అసలు క్షమించలేను ..!

      అణచివేతని, అసహనాన్ని, అన్యాయాన్ని .. ఎదుర్కొన్న మీకు.. కొంత ద్రవానికి బానిస కాకూడదని తెలీదా… ఒక లార్జ్ లైఫ్ బ్రతికే మీలాంటి కళాకారులకి … లార్జ్ జీవితం , ప్రేమ అందరికీ పంచే మీలాంటి సంగీతజ్ఞులకి.. ద్రావకాల అపశ్రుతులు తెలీదా.. లేదా తెలిసినా మీకు లెక్క లేదా.. ?

      ఇవాళ విభజన గీతలు , గజల్ సంగీతాలూ.. ఘోల్లుమన్నాయి .. ఏభై ఏళ్ళ కే …నూరేళ్ళు నిండిన మిమ్మల్ని చూసి

      రాయాల్సినవి, పాడాల్సినవి… పాడయ్యి, దుమ్ము దులపాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి పైడమ్మా .. ఒక్కసారి మళ్ళీ రాకూడదూ .. ?

      మీరు లేని వ్యంగ్యం … శూన్యంగా ఉంది.. సగం రాస్తున్న కవిత లో, లోపించిన రిధం లా …

      అంతటి హిందూ మహా సముద్రాన్ని .. మా వొక్కరి దోసిళ్ళతో తోయలేక పోతున్నాం ..

      సాయం రాకూడదూ… ?

      అన్నట్టు.. శేషేంద్ర శర్మ “ రుతు ఘోష “ ఆడియో చేద్దామనుకున్నాం .. మర్చిపోయారా ..?

      –సాయి పద్మ

      నేనూ- నా చుంపాత

      india_bricks_labour

      ముతక పరికిణీ కచ్చపోసి కట్టి

      నాన్న బుష్కోటు పైన తొడిగి ,పైగా గళ్ళ తువ్వాలు భుజానేసి

      పగుళ్ళు పట్టిన కాళ్ళతో ,సిమెంట్ దూరిన గోళ్ళతో

      వాడిపోయిన మల్లెల దండతో, ఎండకి మాడిపోయిన మొహంతో

      చెమటకి తడిసి రంగుమారి వదులైన బట్టలతో,

      తిరిగే నేను, ఆ కామపు దున్నపోతుని

      యెట్ల రెచ్చగొట్టానో అర్ధం కాలేదు

      రెచ్చగొట్టటానికి ఆకారం తెలీకపోయినా ఆడపిల్లయితే చాలని

      అప్పుడు అర్ధం కాలేదు

      నిత్యం నే నెత్తిన పెట్టి తిరిగే నా చుంపాత 

      నా మాడుకి గొడుగయ్యింది

      ఎండ గాడ్పుకి చల్లటి చలివెంద్రమైంది

      ఆకలి చూపులని వడపోసే ఆచ్చాదన అయింది

       

      ఇంతేనా ..ఇంతేనా

      దున్నపోతు మేస్త్రీ నా కొడుకు మస్తరేస్తానంటూ

      కన్ను మలిపితే, విసిరికొట్టే చర్నాకోలయింది

      తాగుబోతు కూలీల విసురు మాటలకి

      కనబడని ఖడ్గమైంది

       

      అంతేనా .. అంతేనా

      చిరగని బట్టల్లో నన్ను రేచ్చగోట్టావంటూ

      మునిమాపు వేళల్లో , కళ్ళూ మనసూ మూసుకుపోయి

      ఓ మృగం నన్ను నలిపెస్తుంటే

      వాడి మగతానానికి వురేసే ఉరితాడయింది

      నా చుంపాత

      ఉరి పడ్డ మగతనంతో లుంగలు

      తిరుగుతూ వాడు

      నన్ను రక్షించుకోగల ధైర్యంతో నేను

      ఇప్పుడు ఎప్పుడు బయటికెళ్ళినా

      నా చుంపాత మర్చిపోను

      అది నన్నెప్పుడూ మోసం చేయదు ..!

       

      ఎందుకంటె …

      పద్యంలో నాకు నమ్మకం లేదు

      గద్యం , నా మీద దాడి చేసిన వాడి

      గరుకు గడ్డంలా నన్నెప్పుడూ బాధిస్తూనే ఉంది

      అక్షరం – నువ్వు చాలీ చాలని బట్టల్లో

      నన్ను రేచ్చగోట్టావంటూ పలికే

      చాతకాని మాటల్లా నంగిగా నవ్వుతుంది

      –సాయి పద్మ

      INDIA-ENVIRONMENT-INDUSTRY( తన మీద దాడి చేసిన వాడ్ని, తన తలకు బరువులు మోసేందుకు వీలుగా పెట్టుకున్న తువ్వాలు గుడ్డ తో, అతని పురుషాంగాన్ని బిగించి, తనని తాను రక్షించుకున్న ఒక చెల్లెలికి వందనాలతో.. )

       

      © Sai Padma:// IPR All Rights Reserved

      వెళ్ళిందా .. ఎక్కడుంది ??

      040320111365_edited Nokia N95 Pics 240

      ఇవాల్టికి ఆమె వెళ్ళిపోయి రెండు నెలలు.. వెళ్ళిందా , ఎక్కడుంది అనే ప్రశ్నలకి సమాధానాలూ లేవు, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆమె తిరిగి రానూ రాదు. తలచుకుంటే ఒక గర్వమైన వేదన వస్తుంది.

      ఇప్పుడే కదా .. కేన్సర్ అని తెలిసింది, అంతలోనే కదా అది నయమైంది అని కూడా తెలిసింది.. అంతలోనే కదా ..అసలు ఏమి తినాలో ఎలా ఎలా తినాలో, ఆరోగ్యకరమైన సూప్స్ ఎలా తయారు చేసుకోవాలో తను మాకు క్లాసులు చెప్పింది.

      అంతలోనే , అంతా అయిపోయి ఆమె వెళ్ళిపోయింది అంటే నమ్మబుద్ధి కావటం లేదు. “ ఇదిగో పద్మా, నువ్వు రచయితగా సంపాదించేది అంతా నాకే ఇవ్వాలి “ అంటూ ఆమె ఇంకా నవ్వుతున్నట్టే ఉంది..

      తలంటి పోసుకోగానే, నా రెండు పుంజీల వెంట్రుకలనీ ఎలా సంరక్షించుకోవాలో, చిన్నప్పుడు ఆమె జుట్టు ఎలా ఉండేదో చెప్తున్నట్టే ఉంది. ( ఒకసారి బ్యూటీషియన్ హెన్నా వేద్దామని ఒక పేకెట్ తెస్తే ఆమె వొత్తైన జుత్తుకి చాల లేదు. తన వయసు అపుడు అరవై. )

      తన పిల్లల గురించి, వాళ్ళని పెంచటానికి తను చేసి అంతర్ బహిర్యుద్ధం గురించి చెప్తున్నట్టే ఉంది

      మనం అత్తా కోడళ్ళలా దేబ్బలాడుకోవటం లేదేమిటి అని ఆశ్చర్యపోతున్నట్టే ఉంది

      ఇంకా కోల్పోని పల్లెటూరి మట్టివాసనలకై ఎడురుచూస్తున్నట్టే ఉంది .. కలలు కంటున్నట్టే ఉంది ..

      నువ్వు వెళ్ళిపోయావని అనిపించటం లేదు మమ్మీ.. అత్తమ్మా ..

      ఏ వంటింట్లో నుంచో .. మా ఇంటి వంట ప్రోగ్రాం చూస్తూ.. మీరైతే ఎలా చేసేవాళ్ళో చెప్తారు అనిపిస్తోంది.. చాలా భారంగా ఉంది..

      జీవితం నిరంతరం స్ట్రగుల్ అయి, సఫలం చేసుకొని, సెలెబ్రేట్ చేసుకొనే సమయంలోనే మిడిల్ డ్రాప్ చేస్తారెంటి ఈ ఆడవాళ్ళు.. ఓహ్.. ఐ హేట్ విమెన్ ..!! ఐ లవ్ టు హేట్ దెం…!!

      –సాయి పద్మ

      040320111368

      © Sai Padma :// IPR All Rights Reserved