అమెరికన్ తెలుగు వారి ప్రేమ రాహిత్య కథ….తన్హాయీ…

373632_285937414775795_185417698_n

కల్పన రెంటాల గారి రచనలతో నా పరిచయం ఆవిడ బ్లాగ్ ద్వారా.. ఇంకా..ఆవిడ వ్యాసాల ద్వారా..ముఖ్యంగా ప్రముఖ అమెరికన్ కవయిత్రి మాయ అంజేలో గురించి కల్పన గారు రాసిన వ్యాసం నన్ను ఎన్నాళ్ళో వెంటాడింది.. !అలాంటి ఆవిడ రాసిన నవల అనగానే కొంచం విశ్వనాద్ గారి సినిమా తరహాలో ఆసక్తి సహజమే. కొంచం అక్కడక్కడా బ్లాగ్స్ లో చదివినా.. పుస్తకం చేత్తో పట్టుకొని చదివిన అనుభూతి వేరు కదా! అందులో ప్రేమ నవలాయే!

కానీ ప్రేమ నవల అనుకున్నది ప్రేమ రాహిత్య నవల అనిపించింది చదువుతూ ఉంటె..! మధ్యలో ఆపలేం ఎందుకంటె ఆమె శైలి అలాంటిది.. ప్రేమ పట్ల నిబద్ధత ఉన్న ఒక కవయిత్రి నవల రాస్తే ఎలా ఉంటుందో తన్హాయీ చదివి తెలుసుకోవచ్చు. కానీ ఆ నిబద్ధత ఆయా పాత్రలలో ఇంచుక కొరవడటం మనకి నిరుత్సాహం కలిగించే విషయం. ముఖ్యంగా మూడు పాత్రలైన కల్హార, కౌశిక్, చైతన్య పాత్రలలో అల్లిన ఒక ముక్కోణ ప్రేమ రాహిత్య కథ తన్హాయీ. కల్హార పాత్రని చక్కగా తీర్చి దిద్దారు రచయిత్రి., శ్రద్ధగా ఆ పాత్ర చీర కట్టులా, కల్హారకున్న మంచి అభిరుచిలా!

కానీ ప్రేమకీ, ఆకర్షణకీ  మధ్య ఉన్న చిన్న గీతలా, నిజానికీ, దాన్ని ఎదుర్కొనే విధానానికీ ఉన్న తేడాలా..పాత్రల బలహీనతల్ని పూర్తిగా వివరించాలేకపోయారనిపిస్తుంది. వేరు వేరు వ్యక్తులతో  వివాహితులయిన కల్హార కౌశిక్ ల మధ్య ప్రేమ అనబడే ఒక ఫీలింగ్ ని అంతా చక్కగా చెప్పిన రచయిత్రి… దానికి దారి తీసిన కారణాలను గానే, లేదా తమ సంఘర్షణను ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవటానికి చేసే ప్రయత్నం బలంగా లేదు.. అది ప్రేమా, మొహమా, లేదా తమ వంటరితనం వల్ల, ఇంకొకరితో అభిరుచులు కలవటం వల్ల ఏర్పడిన బంధమా? అనే విషయంలో పాత్రలను వీలయినంత అయోమయంలో వదిలారు రచయిత్రి. దేహం యొక్క కోరికలతో ..నిలువరించని మొహంతో.. అమీరుతో వెళ్ళిపోయిన “మైదానం” రాజేశ్వరి కీ.. కల్హార పాత్రకీ తేడా కేవలం ..ఆ వ్యక్తిని మంచి అభిరుచి కల, అమెరికన్ వాతావరణంలో ఉన్నా సౌకర్యాల తో పాటు ఇబ్బందుల తోనూ చిత్రించటం మాత్రమేనా ? అన్న ప్రశ్న నన్ను బలంగా కుదిపేసింది. అదే నిజమైతే…ఆ తరం నుండి ఈ తరం వరకు కల్చరల్ సెట్టింగ్ మారటం తప్ప, అమెరికాలో తెలుగు వారి జీవన విధానం, వాళ్ళ బాధ్యతలు, ప్రేమలూ,మొహాలూ, సరిగ్గా మనకర్ధం కాలేదో..లేదా అవి అలాగే ఉన్నాయో ఒక తెలియనితనం ఆవరించింది.

ఇంకొక చెప్పుకోదగ్గ విషయం.. మిగతా పాత్రలైన మృదుల, చైతన్యలు. వివాహేతర ప్రేమలూ,ఆకర్షణలూ కొత్త కాని దశకి మన సమాజం ఇప్పటికే చేరుకుంది ( దాన్ని గురించి వీలైనంత ఎవరూ మాట్లాడకపోయినా..!) సో ..ఆ దశలో ఉన్న కాపురంలో ఉన్న మృదుల మరియు చైతన్య పాత్రల మానసిక పరిణితి మీద, రచయిత్రి శ్రద్ధ పెట్టలేకపోయారు అనిపిస్తోంది.

మొత్తానికి చెప్పాలంటే…అంత మంచి శైలి, చదివించే అల్లిక, ఒక వ్యక్తిత్వ వికాసమో, ఆధ్యత్మికమో కాకుండా చాల రాజులకి చదివిన తెలుగు నవల. కొంచం ప్రేమలతో పాటు, వాటి బలహీనతలూ, ఇంకా మనిషి చుట్టూ పని లా ఆవరించుకుంటున్న వంటరితనాలూ, వీటి గురించి కూడా రాయమని, రాయగలరని .. కల్పన గారికి నా అభ్యర్ధన!

కొసమెరుపేంటంటే…అంత చక్కటి వరలక్ష్మి+ కలువ పేరుని తన నాయికకి పెట్టిన రచయిత్రి.. పుస్తకానికో తెలుగు పేరు పెట్టి ఉంటె భలే ఉండేది!

–సాయిపద్మ మూర్తి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s