(అ)మృత భాష….

  my love

 

  తెలుగు చచ్చిపోతోందంటే దిగులేస్తోంది

తేట నీటి అలల వలపు తెలుగు

వగరు ఒగర్పుల ఉగాది పచ్చడి తెలుగు..

జిలుగు వెలుగుల తరుగు లేని పసిడి తెలుగు..

అధః పాతాళానికి పడనీయని నుడికట్ల నిచ్చెన తెలుగు..

 

అయినా.. వయసైపోయింది..

జరా మరణాలు సహజంమందులు మింగినా తగ్గని జలుబంత సత్యం..

అయినాఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందిలే..

వాయిదాలేస్తోంది ఇప్పటికే..

ప్రాచీన అర్వాచీనాలనిపట్టుకు వేళ్ళాడుతూ

 

కానీఎక్కడో ఏదో .. తడి లాంటి తెలియని వెలితి

నరం మెలి తిప్పే బాధ.. మోచేతి దెబ్బలా..

శబ్దం లేని రంపపు కోతలా

 

అమృతమే తాగకపోతే

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములనిఎవరడుగుతారు??

మసి అంటని మానవతా మణి మందిరాలని.. ఎవరు మేల్కొలుపుతారు??

వెన్నెలంతా మేసి యేరు నేమరేసిందంటూమనల్నేవరు నమ్మిస్తారు??

మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్“…అంటూ మనకెవరు గడ్డి పెడతారు??

బాధా సర్పద్రష్టులార..! ఏడవకండేడవకండి…”..అనేవరు జ్వలిస్తూ లాలిస్తారు..??

పున్నాగ పూల సన్నాయి పాట నెవరు వినిపిస్తారు??

 

నా దుఖం లో నేనుంటే..

మరో ప్రపంచం పిలుస్తోందా మళ్ళీ?హేళనించిందో స్వరం..

కాదు..కాదు.. మరి ప్రపంచం లేదన్నాను నేను..

ఇదేమీ నా గొప్ప కాదు..

తరానికి పై రాతల లోతులు.. అవి మార్చే గీతలు అక్కర్లేదు

అలా రాయగలిగే వాళ్ళు..వాళ్ళ పర లోకాల, ఇలాతలంలో తొంగి చూడట్లేదు..

 

సరే..పెరుగుదాం ఇలాగే..

అమ్మ చేయి విదిలించుకున్న చంటిపిల్లాడిలా..

అమృత భాష తోడు రాని మృత జీవాల్లా..

పోనీ.. మీకన్నా తెలుసా..?

వాట్ హాప్పెండ్ టు అవర్ తెలుగు అని..???

సాయి పద్మ

9 thoughts on “(అ)మృత భాష….

  1. i j swamy అంటున్నారు:

    ఆటవెలది

    మధురమైనభాష మాతెలుగుభాషది
    అచ్చులంతముండు నన్నిచోట్ల
    తత్సమంబుగాక తద్భావాలుండును
    తేనెలోలుకుభాషతెలుగుభాష

  2. prakash అంటున్నారు:

    చాలా బాగుంది సాయి పద్మ గారు

    అమ్మా,నాన్నలన్న మాటలు అవుతున్నాయ్ అంతర్ధానం
    మనవాడుకలోని తెలుగు తరుగుతోందని అంతర్లీనం
    -సుష@4U4ever@

  3. Gijigaadu అంటున్నారు:

    నాకు తెలుసు …తెలుగు ఎక్కడ బ్రక్తుకుతోందో … శాయి పద్మజి!.. తెలుగు పూరిపాకల్లోనన్నా చిగురిస్తోందని ఆనందంగా వుంది. తెలుగు బ్రతకాలంటే మీరన్నయంతటి ఘనతర భావ సంద్రాలు అక్కరరలేదు సరళతర గ్రామ్య పద వ్యక్తీకరణలు చాలు . ఊపిరిపోసుకుంటుంది.కుడ్య హర్మ్య భవన సముదాయాలలో ఆంగ్లమే స్తిరనివాసమేర్పరచుకొని రాజ్యమేలుతోంది….Sreyobhilaashi …Nutakki Raghavendra Rao.

  4. d.v.hanumantha rao అంటున్నారు:

    తెలుగు భాష తియ్యదనం రుచి… పోతోందనే ఆవేదన.. అర్థం చేసుకోగలం.. ఆర్థికస్థాయితో నిమిత్తం లేకుండా డాడీ, మమ్మీ చదువులకు పోతున్నారు ప్రజలు… ప్రభుత్వ పాఠశాలల నిర్లక్ష్యం చేసి పరోక్షంగా కార్పరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు…మార్పు రావాలి.. ఎక్కడినుంచో కాదు మన నుంచే…. ఆవేదన పడకుండా బ్రతికించే కృషి కొనసాగాలి.. ఇంటా బయటా మాటాడుదాం.. మిత్రులకు, బందుగులకు తెలుగులో ఉత్తరాలు వ్రాద్దాం… తెలుగు పుస్తకాలు చదువుదాం.. చదివిద్దాం… ఉత్తరప్రత్యుత్తరాల సంస్కృతి పోయింది. తెలుగు పుస్తకాలు కాదు కదా ఏ పుస్తకాలు చదవని జాతి తయారైపోతోంది..
    ఇవి పునరుద్ధరిస్తే తెలుగు తీగ నవ నవలాడుతుంది… అందమైన పూలు పూస్తుంది.. ఫలప్రదమౌతుంది… జయోస్తు… విజయోస్తు…

  5. రాంకుమార్ భారతం అంటున్నారు:

    ఇంగ్లీషు తాత్కాలికం. తెలుగు ఎప్పుడూ ఉంటుంది. ఇదొక చక్రభ్రమణం అంతే.

Leave a reply to రాంకుమార్ భారతం స్పందనను రద్దుచేయి