కష్టమే నా ఇష్టం…

surrogates

నా దగ్గర ఉన్నదిదే..నేను అమ్మేదిదే..

ఎవరేమైనా అననీ..

గోప్పననీ..తప్పననీ..పతిత అననీ…పరాన్న భోక్తం అవనీ..

నా పిల్లల ఫీజులు కట్టేందుకు…మేం మనుష్యుల్లా బ్రతికేందుకు..

తప్పదీ తొమ్మిది నెలల బరువు..

తోసేసా తలకెత్తుకున్న పరువు…

నా గర్భం అమ్మక తప్పదు.. నా దగ్గర ఉన్నదిదే..

 

పొగిడారు కొంతమంది.. తెగిడారు మరింతమంది..

అసూయ పడ్డారు మా వాడ వాళ్ళు..

ఆశగా చూసారు అవకాశం రాని వాళ్ళు..

ఛీ..దీనికన్నా ఒళ్లమ్ముకుంటే నయం…అన్నాయి కొన్ని నోళ్ళు..

నా కడుపు కూడా నా వోళ్ళే కదా..

వచ్చిందో సందేహం

వోళ్ళే కదా అమ్ముకుంటున్నది..??

నీరు పట్టిన నిండు నెలలే కదా నా వరకు మిగిలేది..?

వ్యభిచారం కంటే.. వంశాలు నిలపటం

ఖచ్చితంగా లాభసాటి బేరం..

 

నిజమే.. ఈ పని ఘోరమే..

రక్త బంధాన్ని.. ప్రేమ పాశాన్ని అమ్ముకుంటున్న నేను..

మీ ఊహా ప్రపంచపు బ్రహ్మ రాక్షసినే..

బ్రహ్మ రాయలేని నా విధి నేను విధిగా నిర్వర్తిస్తున్న దానినే

అందుకే మీ సహానుభూతి పై ఆశా లేదు..

సహకారం పై ఆసక్తీ రాదు..

అవునూ.. మళ్ళా సందేహం..

నా కడుపు..క్షమించాలి నా వొళ్ళు నేనమ్ముకుంటే..

మీకేంటి బాధ..??

పుట్టిందగ్గర్నుంచీ అద్దె కిస్తూనే ఉన్నా కదా

పాచి పనుల్లో.. అమ్మకి చేతులిచ్చా..

తాగోచ్చిన నాన్న దెబ్బలకి.. వీపు..

పెళ్ళయ్యాక మావోడికి.. వొళ్ళంతా ఇస్తూనే ఉన్నా..

అమ్మనయ్యాక నా పిల్లల కోసం రక్తం..

ఇలా వీళ్ళందరికీ అడక్కపోయినా మనసు నైవేద్యం ఇస్తూనే ఉన్నా..

ముక్కలుగా కోసి .. శరీర పళ్ళెం లో పెట్టి మరీ..

 

ఇవాళ ఏదో నా గర్భం అద్దె కిస్తే..

భూగర్భం చీలినంత గోల చేస్తారెందుకు..

ప్రతీ ఆడదీ చేస్తున్నదేగా..

ఇప్పుడు దానికో వెల నిర్ణయమైనందుకు..

మనం సంతోషించాల్సిన విషయం కదూ..

 

india-surrogacy-305

సరే గానీ..

నిరంతరం తాము నమ్మిన విలువలు అమ్ముకుంటున్న వారి మీద

లేని జాలి, జుగుప్స..

నా మీద కుమ్మరించకండి దయ చేసి..

వర్ణాల కతీతంగా వంశాల బరువు మోయగలం గానీ..

మీ సానుభూతి నెత్తి కేత్తుకోలేను..

అసలే ఒట్టి మనిషిని కాను నేను..!!

–సాయి పద్మ

ప్రకటనలు

3 thoughts on “కష్టమే నా ఇష్టం…

 1. John Hyde Kanumuri అంటున్నారు:

  రోజు రోజుకీ మీ అలోచనల్లాగే
  కవిత్వమూ పదునెక్కుతోంది

  ఒక స్త్రీ వేదన అనాలా!
  స్త్రీ వాద కవిత్వమనలా!
  స్వేచ్చ కోసం చేసే ఆక్రందన, పోరాటం అనాలా!

  మీకు అభినందనలు…..కవిత్వానికి జయహో!

 2. madhavaraopabbaraju అంటున్నారు:

  శ్రీ పద్మగారికి, నమస్కారములు.

  “నా కడుపు..క్షమించాలి నా వొళ్ళు నేనమ్ముకుంటే..” “ ఇవాళ ఏదో నా గర్భం అద్దె కిస్తే.. ”

  ఈ మీ కవితలో మీ భావావేశాలని నేను అర్ధం చేసుకున్నాను. కానీ, కొన్ని విషయాలను మనం మరచిపోకూడదు. ఒక రైల్ బండి సరిగ్గా నడవాలంటే అది రెండు పట్టాలమీదనే నడవాలి. లేకపోతే గాడి తప్పిపోతుంది. ఆలాగీ, మన హిందూ ధర్మంలో, ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రైల్ పట్టాలాంటి కొన్ని నిర్దిష్టమైన నియమనిబంధనలు పెట్టబడ్డాయి. అందులో, ఒక ముఖ్యమైన వ్యవస్థ “వివాహ వ్యవస్థ”. ఇందులో భార్యాభర్తలది సమానమైన పాత్రలే. నిజం చెప్పాలంటే స్త్రీ పాత్ర ఒకింత ఎక్కువనే చెప్పాలి. చక్కటి పిల్లల్ని కని, పెంచి, సంస్కారవంతులుగా తీర్చిదిద్ది, సమాజానికి అందించాల్సిన బాధ్యత భార్యాభర్తలది. కేవలం శృంగారం లేదా శరీర సుఖానికోసం వివాహం చేసుకోనక్కరలేదు. వివాహ లక్ష్యం వేరు, అది చాలా ఉన్నతమైనది. ఈ వ్యవస్థలో `ఒళ్ళు అమ్ముకోవటమనేది” అసంబద్ధం.

  ఇక, మీరన్నట్లుగా ` ఒళ్ళు అమ్ముకోవటం; గర్భం అద్దెకివ్వటం’ గురించి:- అమ్ముకోవటం అనే విషయం వచ్చినప్పుడు కొనటం అనే విషయం కూడా వస్తుంది. సహజంగా, కొనటం, అమ్మటం అనేది వస్తువులకి మాత్రమే వర్తిస్తుంది. వస్తువుని నచ్చితే కొంటాము , లేదా కొన్న తరువాత వాడుకలో నచ్చకపోతే అమ్మేస్తాము లేదా చెత్త బుట్టలోకి పడేస్తాము. ఇక్కడ స్త్రీ కొనబడే లేదా అమ్మబడే వస్తువు కాదు; కానేరదు. ప్రపంచంలో అందరికీ అన్నీ వుండివుండాలనేదేమీ లేదు. డబ్బు ఉన్నవాడికి చదువు వుండకపోవచ్చు; అన్నీ అంగాలూ బాగా వున్నా, కళ్ళు లేకపోవచ్చును. మనకు కావాల్సినవి సహజంగా లేనప్పుడు మరొక పద్ధతిలో, వాటికి సమానమైన వాటిని పొందటానికి ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ బతకటానికి మాత్రమే. పిల్లలు లేకపోతే పిల్లల్ని దత్తత తీసుకోవచ్చును. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డపై తల్లికి వుండే సహజ ప్రేమ, అద్దె గర్భంద్వారా పుట్టి వచ్చిన బిడ్డపై వుండదు. అందుకే దానిని `రక్తసంబంధం’ అని అంటారు.

  కొన్న వస్తువు నచ్చకపోతే పడేస్తాం. అద్దె గర్భం ద్వారా వచ్చిన బిడ్డ విషయంలోకూడా ఇదే పరిస్థితి కల్గవచ్చునుకదా. అంతేకాకుండా, అద్దె గర్భంద్వారా పిల్లల్ని కొనుక్కోని, ఆ పిల్లల్ని ఒక `లాడెన్’ లాంటి విషపు మనుషులుగా తయారుచేసి అల్లకల్లోలం సృష్టించవచ్చు. ఇది మరీ దూరాలోచన అని అంటారేమో!! కానీ ఇది నిజం. ఇప్పటికే మనం `టెస్ట్ ట్యూబ్’ పిల్లల్ని చూసాము. ఎంతోమంది శాస్త్రవేత్తలే ఈ పద్ధతి విపరీత పరిణామాలకి దారి తీస్తుందని హెచ్చరించారు. `పిల్ల బడి జీతాలు కట్టాలంటే’ ఆ స్త్రీ లేదా ఆ తల్లి తన గర్భాన్నే అద్దెకి ఇవ్వాల్సిన అవసరం లేదు. తరుణోపాయాలు ఎన్నో వుంటాయి.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s