నాలోని నేను…. వోల్గా గారి భావాలు..

Presentation1

volga 2

 

ప్రముఖ రచయిత్రి వోల్గా, సాయి పద్మ కబుర్లు.. కొన్ని ఆలోచనలూ.. బోల్డు సంతోషాలూ..

వోల్గాసాహిత్య, సామాజిక రంగాల్లో ఉన్నవాళ్ళకి, పరిచయం ఉన్నవాళ్ళకివేరేగా పరిచయం అక్కర్లేని పేరు, మనిషి. వోల్గా గారితో నా పరిచయం సామాజిక రంగం ద్వారా అయినా, మేము మాట్లాడుకున్నది తక్కువే అయినా.. కమ్యూనికేట్ చేసుకున్నది, రిలేట్ కాగలిగింది ఎక్కువ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నన్ను ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తున్న వ్యక్తుల్లో ఆమె ఒకరు.

అలాంటి వోల్గా తో నా కబుర్లు.. కొన్ని మానవ ప్రపంచాలకి కిటీకీలు అని నాకు అనిపించి.. నా సందేహాలూ,, నా సంక్ర్లిష్టతలూ, మా పర్సనల్ కబుర్లూ పక్కన పెడితే.. ఆమె తో సుమారు రెండు గంటల సేపు మాట్లాడాక.. ఆమె వ్యక్తిత్వ పరిమళం కొంత అర్ధం చేసుకున్నాక, ” ఒక ఉపయోగపడే మేధో మహిళా జీవితం..” నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అనిపించింది.

ముఖ్యంగా, సీరియల్స్, షాపింగ్, తమ తమ పెళ్ళిళ్ళు, కష్టాల, దుఖాల , సుఖాల చిట్టా పద్దులు కాకుండా ఇద్దరు స్నేహితులైన ఆడవాళ్ళు మాట్లాడుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చెప్పాలనిపించింది..!!

ఇంక ప్రశ్న జవాబుల్లోకి వెళ్ళిపోదామా..?

సాయి: మనం ( మీన్ ఆడవాళ్ళం) మారమా..?

వోల్గా: (నవ్వుతూ..) మనం మారుతూనే ఉన్నాం.. మీరు మారలేదా..నేను మారలేదా..? ఒకేఆడవాళ్ళు, మగవాళ్ళు, అనే పని విభజన తో ఎవరూ పుట్టరు. వాళ్ళు తయారవుతారు. మగవాళ్ళు తయరయినట్లే, ఆడవాళ్ళు కూడా.. పెట్రియార్కీ భావజాలాన్ని వదిలించటం అంటే.. ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాంటిది. చెడ్డ రక్తాన్ని తీసి మంచి రక్తాన్ని ఎక్కించటం లాంటిది. అంత కష్టం.

సాయి: మనం మారుతున్నాం అనుకుంటూ, పెళ్లి, సహజీవనం, పూర్తి ఇండివిడ్యువాలిటీ ఇలాంటి రకరకాల కాంబినేషన్లు వస్తున్నా.. మళ్ళా అదే కంట్రోల్, డామినేషన్ తో కూడిన సిస్టం లోకి వెళ్తున్నామా..??

వోల్గా: హ్మం. కొంతవరకూ కరక్టే.. పితృస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలివి, కిటుకు అదే. ఒక గొలుసు వదిలించు కుంటున్నాం అనేలోగా.. వేరేవి తెలీకుండా వచ్చేస్తాయి. అవేర్నెస్, స్పృహ మనకి తెలిసేలోగా పాతవి బలపడిపోతాయి. నా విముక్త కథా సంకలనంలో రాసింది కూడా అదే. పౌరాణిక పాత్రలైనా అవి సోషల్ స్టోరీస్. ఆడవాళ్ళు ఆర్ధిక స్వాతంత్రులు కారు కాబట్టి హింస జరుగుతోంది అనుకుంటే, పాపం ఆడవాళ్ళు, చాలా కష్టపడి, ఆర్ధిక స్వావలంబన సాధించారు. అయినా హింస పెరిగింది గానీ తగ్గలేదు అని నీకు తెలుసు కదా..! ఆర్ధిక స్వేచ్చ అయిపొయింది, లైంగిక స్వేచ్చ అయింది. కానీ ఇప్పుడు పవర్ రిలేషన్స్ ఏంటి, కుటుంబ వ్యవస్థలో, పవర్ నిర్వచనం, ఇంకొకరిని డిస్ఎంపవర్ చేయకుండా, మనల్ని మనం, మన స్పేస్ ని మనం హుందాగా నిలబెట్టుకోవటం ఎలా.. అని ప్రతి స్త్రీ ఆలోచించాలి. అందుకే అంటా నేను.. వ్యక్తిగత స్వాతంతం , స్పేస్ కోసం పోరాడటం కన్నా విప్లవం తేలిక..!! అక్కడ నీకు అన్నీ క్లియర్ గా కనిపిస్తాయి.. దోపిడీ, వ్యవస్థ, వ్యక్తి కూడా.. ఇక్కడ మన మనసుతో మనం యుద్ధం చేయాలి. ఎందుకోసం చేయాలి? చేసి ఎవర్ని సాధించాలి.. ? ఇలాంటి ప్రశ్నలకు మనమే జవాబులు వెతుక్కుంటూమన సంతోషం కోసం మనం యుద్ధం చేయాలి.. ఎవర్నీ ఇబ్బంది హింస పెట్టకుండా.. మనవాళ్ళ ఎక్కువ ఉపకారం, తక్కువ హాని జరిగేలా చూసుకోవాలి. ఇది ప్రస్తుతం స్త్రీ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య. అహంకారానికి, ద్వంద్వ విలువలకు దూరంగా.. తన ఆత్మాభిమానానికి దగ్గరగా వెళ్ళటం ..అంత తేలికేం కాదు. కానీ తప్పదు.

సాయి: వెళ్ళే దారి ఏది? ఎలా?

వోల్గా: బై సేయింగ్ నో.. తనకి ఇబ్బంది కలిగించే విషయాల్ని, బంధాల్ని , హింసకునోచెప్పటం ద్వారా.. చాలా పవర్ రిలేషన్స్ మారుతాయి. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు వస్తున్నాయి కదా.. రోజున వర్క్ ఫోర్సు లో లేని ఆడవాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. గిల్ట్ లేకుండా .. వాళ్ళు తమని తాము, తమ స్పేస్ ని తాము.. దిఫెయిన్ చేసుకోగలిగిన నాడు.. చాలా విషయాలు మారుతాయి. సుమారు పంతొమ్మిది వందల యెనభై ప్రాంతాలలో.. మాఅస్మితతరపున, ఒక పోస్టర్ వేసాము. ఒకమ్మాయి.. రిలాక్స్డ్ గా కూర్చొని ఉంటుందిచేతిలో పేపర్ తో.. పక్కన కాఫీ కప్ తో. ” విశ్రాంతి మీ హక్కు.. అది ఎవరో ఇచ్చేదాక ఎదురు చూడవద్దు.. అని. రోజుకి కూడా ఎంతో మందికి ఇష్టమైన, కలల పోస్టర్ అది అంటే.. కొంత మారింది గానీ.. ఇంకా మారాల్సింది చాలా ఉంది అని అర్ధమవుతూనే ఉంది కదా..

సాయి: మీరెలా రాస్తారు..??

వోల్గా: (నవ్వుతూ) ..చేత్తో.. నాకు అనిపిస్తూ ఉంటుంది.. నా మెదడు నా చేతి వేళ్ళల్లో ఉందనిపిస్తుంది. నాకు కంప్యూటర్ అలవాటు కాలేదు. పాపం మా ఆఫీసు వాళ్ళే ప్రింట్ అవుట్ తీసి ఇస్తారు. అన్నీ..!!

సాయి: మళ్ళా సబ్జక్ట్ లోకి.. మార్పు ప్రక్రియకి మనం ఎలా అలవాటు పడాలి?? మారే మార్గం ..అంటే అబ్యూసివ్ గా కాకుండా, ఇంకొకరిని డిస్ ఎంపవర్ చేయకుండా ..ఎలా??

వోల్గా: బై సేయింగ్ నో.. మళ్ళీ..పిరికితనానికి నో చెప్పాలి. .!! ధైర్యం అనేది.. కుటుంబం వల్లా, సపోర్ట్ వల్లా, ఆస్తుల వల్లా, చాలా సార్లు చదువు వల్ల కూడా రాదు.. ఎంతమంది వాళ్ళ బరువు మోస్తామన్నా.. వాళ్ళల్లో ధైర్యం లేకపోతే, మనం పడేస్తాం ఏమో అనే భయం ఉంటుంది.. భయం లో ఉన్న కంఫర్ట్ ధైర్యంలో ఉండదు కదా..!,

చాలా మంది, ఒక పని చేసేలోగా ఎన్నో ప్రశ్నలు అగుడుతారు. వాళ్ళని, ఇతరులని కూడా.. కానీ ఎంత మంది ఎన్ని చెప్పినా, తన స్వతంత్రత తనలో ఉందని అనుకోరు. చాలా ప్రశ్నలకి జవాబులు.. తమని తాము తెలుసుకుంటూ.. తమ స్వేచ్ఛ కోసం చేసే చిన్న చిన్న పనుల్లో కూడా సమాధానాలు దొరుకుతాయి. కానీ, వాళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఆలోగా వయసు, ఎనర్జీ అయిపోతుంది.

సాయి: ఎంత నిజం కదా.. ఇక్కడ హింస ప్రేమ కలిసే ఉంటాయి..

వోల్గా: నిజం.. ప్రేమ, త్యాగం, సేవ,ధర్మం, వీటిల్లోనే గడిచిపోతుంది. అదే చెప్పేది.. విప్లవంలో, యుద్ధంలో.. నీకు శత్రువు క్లియర్ గా కనబడతారు.. వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ తెలుస్తుంది. పోరాటం సులువవుతుంది.. ఇక్కడ అలాకాదు.అన్నీ అణచివేతలూ, హింసలూ.. ప్రేమతోనే, నాలుగు గోడల మధ్యే జరుగుతాయి.

నీకిచ్చిన గురజాడ వ్యాసాల బుక్ లో కూడా నేను రాసింది అదే.. కన్యా శుల్కం లో.. మధురవాణికి సౌజన్యా రావు పంతులుభగవద్గీతపుస్తకం ఇస్తాడు. భగవద్గీతే ఎందుకు ఇచ్చాడు?? ఆధ్యాత్మ రామాయణమో.. కృష్ణుడు అర్జునుడికి.. చెప్పేది అదే కదా.. యుద్ధం తప్పనప్పుడు, ధర్మమైంది అయినప్పుడు, స్వజనం అని వెనుదీయక.. యుద్ధం చేయి..చేయాలి.. అని. ప్రతీ మహిళా చేయాల్సింది అదే.. !! అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

సాయి: హ్మం.. మరి పిల్లల కోసం ప్రపంచాన్నే కదిలించగలిగే పోరాటాలు చేసే మహిళలు, తమకోసం ఎందుకు చేసుకోవటం లేదు..?

వోల్గా: సమాజ ఆమోద ముద్ర కోసం ఎదురు చూసి.. అది దొరకక. పిల్లల కోసం ఏమన్నా చేస్తే సమాజం, కుటుంబం, జనం మెచ్చుకుంటారు. ఆదర్శ మాతృ మూర్తి కితాబిస్తారు. అదే తనకోసం, తన స్పేస్, అంటే.. సెల్ఫిష్ నెస్ అంటారు. సుఖపడుతోంది అంటే.. ఏదో తప్పు చేసే ఉంటుంది అంటారు.. ఇవన్నీ ఆడవాళ్ళ మనసులో ముద్ర పడిపోతాయి. రిలాక్స్ అవటానికి భయపడతారు. సుఖపడటానికి భయపడతారు. ఆనందం.. అంటే భయపడతారు. అసలా కాన్సెప్ట్ రాదు మనసులో..!

సాయి: మీకు ఇన్స్పిరేషన్ ఏంటి..?

వోల్గా: సాహిత్యం.. దాన్ని ఆధారంగా మలచుకున్న నా జీవితం. పూర్తి స్వేచ్చతో, నా సంతోషానుసారం మలచుకున్న నా జీవితం. కృతజ్ఞత, త్యాగం లాంటి భావనలకు లోను కాకుండా.. ఒక సహచరుడు గా కుటుంబ రావు, ఇచ్చే ప్రోత్సాహం.. ఒక కుటుంబ సభ్యునిగా మా నాన్న ఇచ్చిన నమ్మకం, భరోసా. వాళ్లెప్పుడూ..నన్ను చేయి పట్టుకొని నడిపించలేదు. నేను సహాయం కావాలన్నప్పుడు ఆసరా నిలబడ్డారు. నీ జీవితం లో మా జోక్యం లేదు.. అని చెప్పకనే చెప్పటం.. నిజమైన ప్రేమ అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

సాయి: సాహిత్యం అంత ప్రభావితం చేసిందా..? అలాంటి సాహిత్యం ఇప్పుడు వస్తోందా..

వోల్గా: పూర్తిగా.. నేను ఇష్టంగా తినే చిరు తిండ్లు.. చలం,శరత్, గురజాడ సాహిత్యం.. ఇంకా చాలా ఉన్నాయి. చిరు తిండ్లు అని ఎందుకన్నానంటే, మెయిన్ కోర్సు లా తినేసి తినేసి ఉన్నాం కాబట్టి… (నవ్వు) వీళ్ళంతా లేకపోతే మేము ఏమయ్యే వాళ్ళం అని కూడా అనిపిస్తుంది. నన్ను డాక్టర్ గా చూడాలని నాన్న అనుకునే వారు. గుంటూర్ సి కాలేజీ .. కరుణశ్రీ గారి టీచింగ్.. సాహిత్యం మీద ఇష్టం.. ఇదే చదువుకుంటానని చెప్పేసాను. నాకిష్టం లేని బంధాల నుండి కూడా అంతే స్వేచ్చగా బయటకు వచ్చాను.

పోతే.. నీ ప్రశ్నకి జవాబు.. లేదు.. అలాంటి సాహిత్యం రావటం లేదు. రాయగలిగిన వాళ్ళు వాళ్ళు రాయాల్సినంత రాయటం లేదు. చాలా సబ్జక్ట్స్ ఉన్నాయి.. సంక్లిష్టతలు, బలహీనతలూ, వాటి వాటి పరివృత్తాలూ మారాయి. మనం చాలా నేర్చుకుంటున్నాం. మా అస్మిత లో గ్రాస్ రూట్ వుమన్ కి .. జెండర్ ట్రైనింగ్ ఉంటుంది. మొదట్లో వచ్చినవాళ్ళకి .. ఒక సంవత్సరం తర్వాత ట్రైనింగ్ పూర్తి అయిన వాళ్లకి చాలా తేడా.. ధైర్యంలో, అసర్టివ్ గా ఉండటంలో ..కానీ ఎన్నో కథలు, ఇంకా బయటకు రావటం లేదు..చాలా రాయటం లేదు.

సాయి: మీ జీవితం.. ఎప్పుడు రాస్తారు..?

వోల్గా: హబ్బ..ఎంత మాట్లాడుకున్నామో..(నవ్వు..) చాలా మాట్లాడించావు.. త్వరలో రాస్తాను..

వోల్గా గారితో.. మాట్లాడాను.. అనగానే.. ఏం మాట్లాడవు.. అబ్బా..నువ్వు లక్కీ .. మధ్య ఎందుకు అంత రాయటం లేదు.. ?? ఎంత సున్నితంగా, సహజంగా రాస్తారో కదా.. అని.. నన్ను ప్రశ్నలతో కదిపేసి.. కుదిపేసిన.. ఆత్మీయ మిత్రులందరికీ.. ప్రేమతో.. స్నేహంతో.. పోస్టు

నేను..మీ బుర్ర తినెసాను కదా..అంటే..

లేదు ఇద్దరం మాట్లాడుకున్నాం.. నువ్వు నాకు చాలా ఆలోచనలనిచ్చావ్“.. అని ఎంతో స్నేహంతో, ప్రేమతో, సహనంతో.. అన్న వోల్గా గారికి .. ప్రేమతో.. గౌరవంతో.. పోస్టు..

మీ

సాయి పద్మ

ప్రకటనలు

10 thoughts on “నాలోని నేను…. వోల్గా గారి భావాలు..

 1. సుజాత అంటున్నారు:

  తన గురించి తను ఆలోచించుకోగల్గిన ప్రతి స్త్రీలోనూ ఓల్గా కనిపిస్తుంది. అలా ఆలోచించుకోలేని స్త్రీకి ఏం ఆలోచించుకోవాలో ఓల్గా నేర్పుతుంది. నేర్పడం అంటే చేయి పట్టి నడపటం కాదు, ఓల్గా ని చదువుతుంటే “అరె, నా జీవితంలో దీన్ని ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశాను?” అని వెనుదీరిగి చూసుకునేలా చేస్తాయి ఓల్గా అక్షరాలు.

  పెద్ద ఘర్షణలు,వాదాలు,పద బంధాలు లేకనే…అతి నిశ్శబ్దం గా భావ తరంగాల్ని మనసులో రేపి అశాంతి పుట్టించి, ఆ అశాంతిలోనే ప్రశాంతత దొరికేలా చేస్తాయి ఓల్గా అక్షరాలు.

  మానవి చదివిన నాటి సంఘర్షణని ఎవరైనా మర్చిపోగలరా? స్వేఛ్ఛ, సహజ,ప్రయోగం,కన్నీటి కెరటాల వెన్నెల..ప్రతి రచనలోనూ సజీవంగా, మన పక్కింట్లోనో, వెనక వీధిలోనో, ఆఫీసులోనో కనపడే ఆడవాళ్ళు…!!

  భౌతికంగా ఏ కష్టాలూ లేకుండా, మానసికంగా, కాస్తంత భావ స్వేచ్ఛ కోసం నలిగే స్త్రీలని ఓల్గా ఎలా పట్టుకుంటుందో నాకు అంతు పట్టదు.

 2. Praveena అంటున్నారు:

  వోల్గా..ఒక చైతన్యం. మనకే తెలియని మన చుట్టూ ఉన్న చట్రాలను చూపించి…మనమెందుకు ఎందుకు గుర్తించలేదు అనిపిస్తారు. wonderful పోస్ట్ సాయి పద్మ గారు. మంచి ప్రశ్నలు అడిగారు..

 3. వాసుదేవ్ అంటున్నారు:

  తెలుగుసాహితీ ప్రవాహంలొ ఓ నిశ్శబ్ద కెరటం ఓల్గా గారు…ఈ ముఖాముఖి లో ఆమెనుంచి అందరూ వినాల్సినవన్ని ఉన్నాయి.చాలామంది స్త్రీలు (పురుషులు కూడా) అడుగుదామనుకున్నవన్నీ మీరు వారి ప్రతినిధిగా అడిగారు..తప్పక చదవాల్సినది

 4. రమాసుందరి అంటున్నారు:

  రంగనాయకమ్మగారి తరువాత అంత సూటి రాతలు ఆమెవి. స్త్రీ తన ఆలోచనలలోని సంక్లిష్టత ను వదిలించుకోవటం అరటి పండు వలచినట్లు నేర్పించారు. అలాగే పురుషాధిక్య సమాజం లోని బ్రష్టత్వాన్ని పొందికగా వివరించారు. మన ఆలోచనా వాటికలు తెరిపించి ఆమ్లజని ప్రసరింపచేసిన ఓల్గా గారికి కృతజ్నులం అయి ఉందాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s