మావయ్య వచ్చాడంట…

india-12-child-marriage_26

12

పన్నెండేళ్ళు..

మావయ్య వస్తాడంట..

మనసిచ్చి పోతాడంట..

ఎంతిష్టమో ఆ పాటా..నా నేస్తం కళ్ళల్లో మెరుపు

పిచ్చి కబుర్లు..గుళ్ళో దేవుడి ప్రసాదాలు

మళ్ళీ మళ్ళీ..

పాడినప్పుడల్లా అమ్మ అనేది

“మావయ్య వస్తాడులే”..

సిగ్గుతో పోనిమ్మన్నాను గానీ..

సిగ్గు లేకుండా వస్తాడనుకోలేదు సుమా..

రానే వచ్చాడు..

చికాకుగా నా పరికిణీకి అంటిన రక్తంలా..

పెద్దమనిషయ్యానన్నారు..

నన్నొదిలేసి అందరూ మాట్లాడుకున్నారు..

c05ef0f6-0d70-11de-8ac4-000b5dabf613

14.

పద్నాలుగేళ్ళు..

మావయ్య  వస్తాడంట..

ఏంటో  కొంచం  భయం  వేస్తోంది..

రాత్రైతే కడుపునెప్పి ..

మావయ్యతోనే  ఎందుకొస్తోంది..??

అడిగితే నీకు బుద్ధి లేదంటూ చెంపదెబ్బలు..

చదువుకుంటానన్నా

పెట్టె తొడ పాశాలు చాల్లేదా..??

అడిగాడు మావయ్య..

నోరాగిపోయింది..

మనసులోని బడి మూతబడింది..

మధ్యలో పిండం కడుపులో పడింది..

హమ్మయ్య.. ఇంక మీ మావయ్యేటూ పొడే

నీదే అదృష్టం.. అన్నాడు నాన్న..

ఏమో నేను వినిపించుకుంటేగా..

పరికిణీతో కడుపు బాగోదన్నారు..

చీర కట్టు తప్పటడుగుల్లో ఉన్నా నేను..

మావయ్య వస్తాడంట.. పాట నచ్చటం మానేసింది..

 

18.

పద్దెనిమిదేళ్ళు…

చీర కట్టటం బాగా వచ్చేసింది..

రెండు గర్భస్రావాల తర్వాత..

రెండు పిండాలు మిగిలిన తర్వాత.

వంట కూడా..

మావయ్య ఎవర్తినో మరిగాడంట…

ఊరంతా ఎప్పుడో తెలుసంట..

నాకిప్పుడే తెలుసంట..

నాకన్యాయం చేయడంట..

గోల చేస్తే నాకే నష్టమంట..

నోరు మోసుకుంటే అంతా లాభమే నంట..

మనసులో అనుకున్నా..

కొడుకునో, కూతుర్నో ఉద్యోగస్తున్ని చేస్తే

మావయ్య కోసం ఎదురు చూడక్కరలేదని.

మావయ్య వస్తాడంట..

మనసిచ్చి పోతాడంట..

ఇప్పుడు నవ్వొస్తోంది..

మనసివ్వటం తేలిక కాబోలు ..ఇస్తారేమో..

బాధ్యత పడటం కన్నా..

 

25.

ఇరవై అయుదేళ్ళు..

నేను కూడా అందంగా ఉంటానని తెలిసింది..

మావయ్య వస్తాడంట..పాట ఎక్కడో గాని వినపడటం లేదు..

ప్రపంచం ఎంత బాగుంటుంది..

పిల్లలు చదువుకుంటున్నారు..

ఎదురింటి స్టూడెంట్ కుర్రాడి స్నేహం

నా కడుపులో పడింది..

మొదటిసారి పిండం కాదు జీవం అనిపించింది

రక్త పరీక్షలో..తెలిసిందట..

మావయ్య వచ్చేటప్పుడు

జబ్బులు కూడా ఇచ్చి పోతాడంట

నా పిల్లని నేనే చంపేసా కడుపులో..

కరువు తీరా ఏడ్చి మొహం కడుక్కున్నా..

అలాగే ప్రేమనీ.. మనసునీ కూడా..

మావయ్య వస్తాడంట

అన్నీ మార్చేసి పోతాడంట..

ఇలా రాసి ఉండాల్సింది కదూ పాట…

 

40.

నలభైయ్యేళ్ళు..

నేనేనా.. బ్రతికింది..

జీవితం అయిపొయింది..

పిల్లలు వాళ్ళ దారి వాళ్ళయ్యారు..

నా పని అయిపొయింది..

ఓపికగా లేదు ఎందుకో..

అక్కడక్కడా మావయ్య ఇచ్చిన

శిదిలపు ప్రేమ అనవాల్లా..

బతుకు చేదు బాధల్లా..

వంటి మీద మచ్చలుంటేనేమి

ఇంటిపేరు అదే నడుస్తోంది గా..

ఈ శవంలో..

ఊపిరేక్కటే నడుస్తోంది..

తీయటానికి ధైర్యం లేక..

తీసుకొనే ఓపిక లేక..

మావయ్య ఇక్కడే ఉంటున్నాడిప్పుడు..

పోవటం కోసం ఎదురు చూస్తూ..

నేను కూడా ఆ జీవ క్షణాల కోసం

లెక్కపెడుతూ..

మావయ్య వస్తాడంట..

ఎప్పుడన్నా వినపడితే .. ఆ నోరు నోక్కేదాక

చేయ్యాగటం లేదు మరి..

నాలా కాకండి మరి..

మీలా ఉండండి..

child_marriage

–సాయి పద్మ

Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s