నికషోపలం ..ఎవరికి?.. ఎందుకు..??

word_document_104639164_canonical_24afda06b7కాశీ భొట్ల వేణుగోపాల్  నవల “నికషం”

పై

సాయి పద్మ అభిప్రాయం..

 

 

 

 

 

 

నికషం  ఒక చిన్న నవల. కవితాత్మకంగా “ప్రథమ పురుష’ లో రచయిత చే  చెప్పబడ్డ ఒక నిరంతర త్రయం లాంటి ..ముగ్గురు స్నేహితులు, అందులో ఒక స్నేహితుడే  అలెక్స్ రామసూరి గా పిలువబడే మన హీరో. నీతీ..నియమం ..మంచీ చెడూ.. ఒక మనోహర భ్రమ.. అన్న  ఈ వాక్యంతో ఈ నవల ప్రారంభం అవుతుంది.
ఇలాంటి మనోహర భ్రమ.. పూర్తి స్థాయి భారంగా మారిన వ్యక్తి మన అలెక్స్ రామసూరి. ఎందువల్ల అంటే.. అతనో తెల్ల కాకి బంగారం.. ల్యూకో దేర్మా అనే వ్యాధి బాధితుడు..స్పష్టమైన విజువల్ లాగ చెప్పాలంటే.. బొల్లి ఉన్న వ్యక్తి.. స్నేహితుడు దుర్గ భాషలో బొల్లి లంజాకొడుకు.. లంజాకొడుకు ఎందుకంటె.. పాతనగరంలో ..చీకటి సందులో.. తెలీని ఒక తల్లి చేత పాయిఖాన చివరి గట్టు మీద వదిలివేయబడ్డ బిడ్డ…
ఈ విషయం.. రచయిత.. ఫ్రెండ్ పాత్రలో.. కథ మొత్తం చెపుతూనే ఉంటారు. వేణుగోపాల్ గారికి అండర్ డాగ్.. లేదా.. అలెక్స్ మీద ఉన్న ప్రేమకీ, కరుణకీ .. అతని అంతఃకరణకీ ఇవి మొదటి వాక్యాలు మాత్రమే.
అతని ద్వారా వేణుగోపాల్ చెప్పిన బలమైన సందేశం లాంటి ఈ కొటేషన్ … ఈ నవలంతా అంతర్లీనంగా ఉందని నాకు అనిపించింది. . అదేమిటంటే..
” సౌందర్యం ఎప్పుడూ నమ్మక ద్రోహం చేస్తుందిరా…! ముందు దానిమీద అపారమైన నమ్మకం పెంచుకోనేలా అమాయకంగా ఉంటుంది.. దాని తర్వాతోక్షణాన  ఉన్నట్టుండి నుసిగా మారిపోయి.. రేణువులు రేణువులు గా మారి అదృశ్యమయిపోతుంది…!”
ఇంతటి బలమైన వ్యక్తీకరణకు కారణం. అలెక్స్ జీవితం.. సమాజ ఆధారిత, ప్రేరేపిత సౌందర్యం.. ఆ రకమైన భావజాలంతో అతను చేసిన అంతర్.. బహిర్యుద్ధం..ఈ నవల ఇతివృత్తం.
అక్కడక్కడా… వేణుగోపాల్ గారి .. శైలి..చాలావరకు ఒక అధివాస్తవిక (అబ్స్త్రాక్ట్) చిత్రం లాంటి నవల చిత్రీకరణ మనల్ని ఇబ్బంది పెట్టినా.. రచయితకి, సమాజ తూకంలో మనుషులుగా ట్రీట్ చేయని, సమాజంచే ఎవగించుకోబడిన సౌందర్యం మీద ఉన్న ప్రేమ, కరుణ, మనల్ని కట్టిపడేస్తుంది.
ముఖ్యంగా మరో చెప్పుకోదగ్గ విషయం… మేల్  సెక్సువాలిటీని, నిస్సిగ్గుగా, నిజాయితీగా, ఏ ఇజాలూ బాక్సులూ.. లేకుండా .. ఒక vulnerability  ని మెటాఫర్ లా వాడి చెప్పించటం. ప్రపంచ సాహిత్యంలో ఇది కొత్త కాకపోయినా.. మన తెలుగు వాళ్ళకి నిజంగా కొత్తే.. వడ్డెర చండీదాస్, త్రిపుర ఇలాంటి కథకుల ప్రభావం వేణుగోపాల్ గారి మీద ఉందొ లేదో చెప్పేంత పెద్ద విమర్శకురాలిని కాదు గానీ..  కథకునిగా జీవితం మీద ఉన్న ప్రేమ, జీవన స్పృహ, అందులో.. నాణ్యత కోసం అతను పడే తపన… నిస్సందేహంగా ఈనాటి ఫిక్షన్ రచయితలూ, కవులూ అనుసరించదగ్గది.
మామూలు కథలూ, కవితలూ.. చదువుకొని.. జీవితాన్ని సంసారపక్షంగా మాత్రమే చూస్తాం..మాకిన్తకంటే ఓపెన్ మైండ్ అవసరం లేదు.. అని డిక్లేర్ చేసేవాళ్ళు.. కాశీభొట్ల గారి నికషం  చదువుకోవటం.. దాన్ని డిస్కస్ చేయటం అనవసరం.. వాళ్లకి అతని ప్రోటాగోనిస్ట్  అలెక్స్ రామసూరి తో పరిచయం.. నిజంగా ఒక పెర్వర్షనే… !!
అలాంటి హీరో.. అన్ని మానవ బలాలూ, బలహీనతలూ పుష్కలంగా కలిగిన వ్యక్తి. నవల చివర్లో..సగం కాలిపోయిన అతని డైరీల ద్వారా.. అంతని వొంతరితనాన్ని అత్యంత చాకచక్యంగా, హృద్యంగా.. సహజంగా.. కసిగా.. పచ్చిగా చెప్తాడు రచయిత. అతని వొంటరితనాన్ని, స్త్రీ సాంగత్యం కోసం, అన్కండిషనల్ ప్రేమ కోసం, కనీసం స్పర్శ కోసం, దేహ వాంఛల విముక్తి కోసం అతను పడే తపన.. మనల్ని కరిగిస్తుంది. నిజానికి మనందరిలో ఉన్న మనిషిని.. బయటకు తెచ్చే ప్రయత్నం.. చేయటంలో ఉండే భయం కూడా నిక్కచ్చిగా వ్యక్తీకరిస్తారు కథకులు.
అలాంటి అలెక్స్ కి… ప్రియ అనే కాన్సర్ పేషంట్ పరిచయం అవుతుంది.. ఆమె తల్లి.. పాటలు పాడే గాయత్రి ద్వారా.. ఎదగని శరీరం.. కబళించే జబ్బు.. ఎదిగిన మనసుతో…. అలెక్స్ ని  ఏ సంకోచాలూ లేకుండా ప్రేమించి ఆరాధించే ప్రియ ని ఎంతగానో అభిమానిస్తాడు అలెక్స్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం..మానసికం మాత్రమే కాదు,  దైహికం కూడా అని అతని చిత్రాల ద్వారా చెప్పిస్తాడు.
తల్లి నిరాకరణ తో మొదలైన అలెక్స్ జీవితం, వేశ్య నిరాకరించటంతో.. సమాజం మీద కసిగా, గంజాయి మీద, ప్రేమలా మారుతుంది.. ప్రియ పరిచయం అయ్యేవరకూ.. ఒకానొక దశలో స్నేహితులు కూడా.. దూరం అవుతారు. ప్రియ మరణంతో.. అలెక్స్ కి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అతని ప్రవృత్తి.. పరిధి కూడా విశాలమైనదని గ్రహిస్తాడు. ప్రియ నగ్న వక్షస్థలం పై రంగులతో నిండిన అతని బొల్లి చేయి…ప్రియ ద్వారా అతను పొందిన అవ్యాజమైన ప్రేమనీ.. సమాజం మెప్పుదల, అక్సేప్తేన్స్ కోసం అతను ఎదురు చూడక్కరలేదన్న నిజాన్ని గ్రహిస్తాడు. అతని చిత్రాల్నీ, జీవితాన్నీ ఇక్కడే వదిలేసి.. పారిస్ వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇక్కడే.. the journey into nothing ని సరిగ్గా పట్టుకున్నారు కథకులు.. Its an emotional journey of every person who has a vulnerability and who don’t come under societal framework of beauty..
నికషం అంటే గీటురాయి..  కాకి బంగారంలాంటి (లేదా సమాజం కాకి బంగారంలా ట్రీట్ చేసే) అలెక్స్ … పూర్తిస్థాయి నికషోఫలం అందుకోవటానికి, చేసే ప్రయత్నమే ఈ నికషం .
ఐడెంటిటీ క్రైసిస్ నీ.. దాని వెనుక వేదననీ.. ప్రపంచ సాహిత్యంలో మ్యాప్ చేసి పెట్టిన మిలన్ కుందేరా నీ, సంక్లిష్ట మానవ సంబంధాలలో పురుష వంటరితనాన్నీ సూచన ప్రాయంగా చెప్తూ దాని వెనుక ఉన్న సోషల్ వత్తిళ్ళని సున్నితంగా ఎత్తి చూపిన విక్రం సేథ్  లాంటి.. సమకాలీన సాహిత్యకారుల్లో చేర్చదగ్గ.. తెలివైన కథకుడు కాశీభొట్ల వేణుగోపాల్.
దీనికి తోడు… అచ్చ తెలుగు ని అచ్చంగా వాడుకుంటూ.. బాలన్స్ తప్పకుండా.. కథకుని పాత్ర ద్వారా  ఆదర్శ దాంపత్యాన్ని.చెప్పిన తీరు .. నిజంగా ఒక కొత్త ప్రయోగం.. నాకు తెలిసినంత వరకూ. తెలుగులో..
నిజానికి ఇది మనకి ఒక గీటురాయి.. మన ఓపెన్ మైండ్ కీ.. ప్రకృతి ప్రేమకీ.. సాంప్రదాయ ఆలోచనల్లోని అసలు సిసలైన చాదస్తానికీ…మనిషిలోని బలం తప్ప బలహీనతలు అర్ధం చేసుకొని, ప్రేమించని.. మనిషితనం అనే పేరు పెట్టుకొనే కటినత్వానికీ.. !!
వేణుగోపాల్ గారు.. ప్రకృతిని లో మమేకమవుతూ… మనల్ని మమేకం చేస్తూ మిగతా పాత్రలైన, దుర్గ, లతా, కావేరి, గాయత్రి లను.. తీర్చి దిద్దారు. మొదలెట్టాక ఏకబిగిన చదివించటం.. వేణుగోపాల్ గారి శైలి కి కొత్త కాదు. కానీ.. జీవనం లోని బలహీనతలు, జీవనానికి సోపానాలుగా.. మార్చుకున్న బలమైన వ్యక్తిత్వ అభినివేశన  కలిగిస్తాయి పాత్రలన్నీ..
సమాజంతో, ప్రేమతో, నిత్యం చర్మం మీద మనిషి , లోపల మనిషి.. విపరీతమైన కాంక్షతో  చేసే  నిర్మొహమాట యుద్ధ చిత్రం ఈ నికషం..!
ఇలా చెప్తూ పోతే.. ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ని.. నాకు నచ్చినట్టు వర్ణించినట్టు ఉంటుంది. ఎందుకు నచ్చలేదో.. లేదా ఈ రకంగా అసహ్యిన్చుకోవాలి అని తెలుసుకోవటానికి… కూడా ఈ పుస్తకం తప్పకుండా చదవండి.
“సాహితీ మిత్రులు” విజయవాడ వారి ద్వారా ఈ నికషం ముద్రితం..
కినిగె  వెబ్ సైట్ వారి ద్వారా ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ లింక్ చెక్ చేయండి.
http://kinige.com/kbook.php?id=1115&name=Nikasham
–సాయి పద్మ

© Sai Padma :// All Rights Reserved

ప్రకటనలు

2 thoughts on “నికషోపలం ..ఎవరికి?.. ఎందుకు..??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s