రమణా-చలం

image

కొన్ని విషయాలు…ఎంత మరచిపోదామన్నా గుర్తోస్తాఎందుకనో.. కొంత మంది మనుషుల ప్రభావంలా..రచయిత చలం గారి మాటల ప్రభావం..రచనల వేడి ..మనల్ని తాకలేదంటే…మనం తెలుగు సాహిత్యం చదవలేనట్టే…చదివినా అనుభవించనట్టే ..!!

అంతటి చలాన్ని…అరుణాచలంలో కట్టి పడేసిన రమణుడి విశిష్టత ఏంటో తెలుసుకోవాలని.. అరుణాచలం వెళ్లాలని చిన్నప్పటి కోరిక. వెళ్లాం మొత్తానికి… ఒకరోజు నిశ్శబ్ద రమణుని ఆశ్రమంలో…అక్కడ పెట్టిన వేడి వేడి తమిళ భోజన ప్రసాదం తిని.. ఆ పరిసరాలను..నిశ్శబ్దాన్ని మనసులోకి ఎక్కించుకుంటూ..!!

ఇంక మొదలు పెట్టా మా ఆయన బుర్ర తినడం.. చలం గారి సమాధి చూపించు..అని.. మొదటి రోజు ఆశ్రమం అంతా తిరిగి అడిగాడు పాపం.. బుక్ స్టాల్ లో కూడా.. తెలుగు బుక్స్ దగ్గర ఒకాయనకి పాపం మా వారి మీద చాలా జాలి వేసింది.. ” ఆశ్రమం ఎదురు రోడ్ లో ఉంటుందండి…దగ్గరలోనే.. అని బుర్ర గోక్కొని…ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారండీ..” అన్నాడు.

రమణాశ్రమం నీడలో నా వ్హీల్ చైర్ పెట్టి మా ఆనంద్ ఇంక డిటెక్టివ్ పనిలో పడ్డాడు. నేను కూడా ఏదో ఉడతా భక్తి గా తనకి సాయం చేద్దామని, చిక్కాల కృష్ణారావు గారికి ( చలం గారితో నలభయ్యేళ్ళ సహవాసం ఉన్నా వ్యక్తి, చలం ఒక్క కార్డు ముక్క ఉత్తరంతో ప్రభావితుడై, అరుణాచలం లో అడుగుపెట్టి, ఆయన ఆఖరి శ్వాస వరకు చలం తో ఉన్న వ్యక్తి..! ఈ విషయం మాకెప్పుడూ ఆశ్చర్యమే.. ఒక స్నేహితురాలు అడిగింది కృష్ణ గారిని..అన్నేళ్ళు ఒక మనిషితో ఏమీ ఆశించకుండా..స్నేహితునిగా, హితునిగా ,ఇంచుమించు అతని నీడలా..ఎలా ఉండగలిగారు మీరు??? .. అంత పెద్ద ప్రశ్నకి అతని ఒకే ఒక్క సమాధానం..” చలం గారు మాపై, మానవత్వం పై చూపించే ప్రేమ..!” )

ఇంక ప్రస్తుతానికి వస్తే ….కృష్ణ గారు కూడా అదే సమాధానం చెప్పారు.. చాలా దగ్గరలోనే ఉందమ్మా.. ఆశ్రమం ఎదురు రోడ్ లోనే ఉంటుంది అని..సరే అనుకోని మళ్ళా అటూ ఇటూ చూస్తున్నా..రమణాశ్రమం పెద్ద చెట్టు నీడలో కూర్చొని..మధ్య మధ్యలో ..పలకరింపుగా నవ్వే యోగులు, భోజనం కోసం వస్తున్న శైవ భక్తులకు, తిరిగి పలకరింపు నవ్వులు నవ్వుతూ..!!

అంతలో హడావిడిగా వచ్చాడు ఆనంద్…ఒక పత్తేదారు కొత్త రహస్యం కనుక్కొన్న ఉత్సాహంతో…వెళ్లి చూసొచ్చాను.. సమాధి మాత్రమే కాదు.. మాట్లాడే సమాధులు కూడా అన్నాడు..! అదేంటది..? మాట్లాడే సమాధులేంటి?? అని అంటుంటే.. చెప్తానుండు.. అంటూ తోసుకుపోయాడు నన్ను. ఇదేంటి..ఇక్కడ ఈ ఆందోళన..చలం రచనల్లానే..ఉన్నవాళ్ళని వాళ్ళ మాయ లోకంలో ఉండేనీయకుండా…!!

సరే.. వెళ్లాం.. బయటకి.. ఒక తెల్ల బట్టల పెద్దాయన దగ్గరకి… రమణాశ్రమం ఎదురుగానే ఉన్న ఒక చిన్న దర్జీ దుకాణం.. ” సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరన్న అడుగుతారు చలం గురించి.. సమాధి గురించి..” అన్నాడాయన ప్రశాంతంగా..!! రోజూ ఇక్కడే కూర్చొనే వారు.. చలం, కృష్ణ, నర్తకి, చిత్ర (అప్పుడప్పుడూ)అన్నాడాయన గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ.. ” ఏమన్నా మాట్లదేవారా.. నాలో ఉత్సుకత…ఆ చాలా..మనుష్యుల్ని ఇష్టపడే వాళ్ళు.. వాళ్ళని వాళ్ళలా ప్రేమించే వాడు.. ( మళ్ళీ ఇదేనా.. నిజంగా అంతా కష్టమా.. మనుష్యుల్ని వాళ్ళ బలహీనతలతో సహా ప్రేమించటం..!!) నేను అడగని ప్రశ్న అతనిలో కూడా వచ్చిందేమో.. చెప్పాడిలా.. చాలా సాధారణంగా గళ్ళ గళ్ళ చొక్కలతో ..ఇంచుమించు రోడ్ సైడ్ మనిషిలా కనిపించే చలం మీద పెద్ద గొప్ప అభిప్రాయం రమణాశ్రమం లో ఉండేది కాదు.. ముఖ్యంగా రమణ మహర్షి చలం కి ఇస్తున్న ప్రాముఖ్యత కొంత మంది భక్తులకి అస్సలు నచ్చలేదు. ఇదే విషయాన్ని చాలా మంది, కొంత డైరెక్ట్ గానే చెప్పటం జరిగిందట. మీరా రౌడి లాంటి మనిషిని అంత దగ్గరగా కూర్చోపెట్టుకోవటం ,ఇంపార్టెన్స్ ఇవ్వటం మాకు నచ్చలేదు..అని..

దానికి మహర్షి సమాధానం ఒక్కటే.. మీరు అతని బట్టలు చూస్తున్నారు, నేను అతని మనసుని.

హ్మం.. నిజమే కదా చూడాల్సింది చూసాడు ఆయన…!!

ఆ టైలర్ పేరు రాధ. ఈ సారి రమణాశ్రమం వెళ్తే తప్పక కలవాల్సిన మనిషి. ఎన్నో విషయాలు మాట్లాదలేకపోయినట్టుగా అనిపించింది. అక్కడికీ వదలక ..మీకేమనిపిస్తుంది..అని అడిగాం.. అయన చేతులు పైకెత్తి చూపిస్తూ.. ” ఎవరు నేర్చుకోవలసింది వారు నేర్చుకొంటారు అమ్మా.. వాళ్ళు వెళ్ళాక మిగిలేవి కేవలం కట్టడాలే..ఇప్పటికీ ఎవరో ఒకరు వచ్చి చలం గురించి అడుగుతుంటారు…” చలం అక్షరాల ప్రభావం గురించి ఇంతకంటే సింపుల్ గా చెప్పలేననిపించి ఆయన మాటల్ని అలాగే రాస్తున్నాను ( ఆయన వచ్చీరాని ఇంగ్లీష్ కి.. నా వచ్చీరాని తమిళానికి మధ్య వాళ్ళ మనవడు ఒక సంధానకర్త. అతనికి నా కృతజ్ఞతలు)

వెళ్ళం సమాధికి.. రోడ్ వారగా.. చలం “రమణస్థాన్” ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేశాక, కేటాయించిన స్థలం లో చిన్న సమాధి. ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్న టైం లో, చలం సమాధి ఎలా నిర్లక్ష్యం కాబడుతోందో, ఒక వార్తా కథనం వచ్చిందట. దానికి ఆయన వెంటనే స్పందించి తమిళనాడు గవర్నమెంట్ తో మాట్లాడి, ఆ సమాధి చుట్టూ ఒక కాంక్రేట్ గోడ కట్టించి కొంచం నిత్యం నిర్వహణ ఏర్పాట్లు చూసారట.

 

image

అక్కడకి వెళ్లి, చూసాక..ఫర్వాలేదు..సమాధి నీట్ గా ఉంది అనిపించింది. అక్కడ అగరుబత్తి, దీపం వెలుగుతూ ఉంది. దేన్నీ నమ్మని చలం కి పూజ చేయాలంటే అదోలా అనిపించింది. కానీ ఒక ప్రార్థన చేయాలనిపించింది …మనసులో ఇలా అనుకున్నా..

నువ్వు నీలా బ్రతికి,

మనసులో ఉన్నది మొహం మీద

నిర్భయంగా చెప్పి..

సాహిత్యం.. నీ ముందు తరువాత

రెండు పార్శాలుగా విడగోట్టావ్..

ఇప్పుడు కూడా ఇంకా రెండు గానే ఉన్నారు వాళ్ళు..

నిన్ను అర్ధం చేసుకున్నవాళ్ళు

నీ సాహితీ నిర్భాయత్వాన్ని అసూయతో అర్ధం చేసుకొని వాళ్ళు..

ఎవరినన్నా కూడా క్షమించు..

ప్రేమించమని నాలాంటి వాళ్ళు చెప్పకరలేదు..

వాళ్లకి నీ అక్షరంలోని జీవితం అర్ధమైతే వాళ్ళే తోవలో పడతారు..

ఇది నా ప్రార్ధన.

మెటీరియలిస్టిక్ ధోరణిలో.. ఒక సాహితీ సంపదని, మనిషి అస్తిత్వాన్ని మనం పరిరక్షించుకునే విధానం ఇదా.. అని చాలా బాధ కలిగినా… ఒకటే అనిపించింది..

“Chalam’s Literature represents the desired change in society and human behavior. chalam’s immortality is not in his physical remains…they are living and actively kicking in the Telugu minds world wide..!!”

–Sai Padma

వచ్చేస్తుంటే.. దర్జీ రాధ గారి మనవడు పలకరించాడు. ” చూసారా సమాధి? ” అని.. చూసామని చెప్పాం. “మీకో విషయం చెప్పనా.. ఆ రోడ్ వైడెనింగ్ లో ఉంది…అలా చేస్తే సమాధి కొట్టేయాల్సి వస్తుంది. కానీ.. ఎన్ని సార్లు ఆ పని తలపెట్టినా.. అది కాలేదు.. యేవో అడ్మినిస్ట్రేషన్ విషయాలంట.. చివరికి అక్కడ వైడెనింగ్ చేయలేదు.. !!” అన్నాడు.

దానికి ఏ మానవాతీత శక్తులూ, ప్రయోగాలూ.. మా ఊహలూ ఆపాదించకుండా ముందుకు సాగిపోయాం మేమిద్దరం.. బహుశా అదే మేమివ్వగలిగే నివాళి ఏమో..!! నిరంతరం అతని అక్షరాల నుండి నేర్చుకోవటం కాక..!!

–సాయి పద్మ, ప్రజ్ఞానంద్

ఫోటో కర్టసీ మరియు కాపీరైట్ : ప్రజ్ఞానంద్

 

(ఈ వ్యాసం ‘విశాలాక్షి’ పత్రికలో కవర్ స్టోరీ గా ప్రచురితం )

 

ప్రకటనలు

10 thoughts on “రమణా-చలం

 1. బివివి ప్రసాద్ అంటున్నారు:

  పద్మగారూ.. మీరు అరుణాచలం వెళ్లినట్లు వినడం సంతోషం కలిగించింది.
  చలం గారి సమాధి ఉన్న ప్రాంతాన్ని రోడ్ మీద నుండి ఫోటోగాని తీశారా? అలాంటి ఫోటో ఉంటే, నా వంటివాళ్ళు ఎవరైనా వెళ్ళినపుడు, మేము కూడా డిటెక్టివ్ పని చేయనవసరం లేకుండా, సులువుగా కనుక్కోవటానికి బావుంటుందని. 🙂 మరింత వివరంగా ఆ ప్రాంతాన్ని గురించి చెప్పినా బావుంటుంది. సమాధి ఆశ్రమానికి అంత దగ్గరలో ఉంటుందని మీ ద్వారానే తెలిసింది. అందుకు ధన్యవాదాలు.

  • తమ్మి మొగ్గలు అంటున్నారు:

   ఉంది అండీ .. మీకు పంపుతాను . రమణాశ్రమానికీ, ఆశ్రమం వాళ్ళు నడిపే హాస్పిటల్ ( చిన్న క్లినిక్ నడుపుతున్నారు వాళ్ళు అదే వరుసలో ) ఎదురు రోడ్ లో ఉంది .. ఒక బోతిక్ షాప్ ఉంది . ఆ షాప్ గుమ్మం లోనే సమాధి ఉంది . తప్పకుండా వెళ్ళండి .. థేంక్ యు ఆర్టికల్ నచ్చినందుకు

 2. Pranav అంటున్నారు:

  Sai Padma garu, thanks for sharing your experience. I know that Chalam spent his last days in Ramanaashramam. But never heard about his samaadhi there.
  Nenu kuda arunachalam vellaali ani chaala rojulugaa anukuntoo vaayidaa vestunnaanu. Velthe tappakundaa ikkadiki kuda veltaanu.

 3. Vijaya Kumar manam అంటున్నారు:

  చలం గారి రురించి ఎంత చదివినా…
  ఇంకా అర్ధంకాని విషయమేదో మిగిలి ఉందని పిస్తుంది!…
  ఆలాంటి సందేహల నివృత్తి కధనాల పరంపరలో…
  మీ అనుభవ కధనం ఒకటి!.
  అభినందనం అమ్మా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s