నా లోని నేను – నేనూ- నిడదవోలు మాలతి గారూ ..!

image

 

అనగనగా ఒక అమ్మాయి .. ఎప్పుడూ ఒకటే పనితో, ఏదో చేయాలనే తపనతో … సగం చేస్తూ , సగం సాగలేని అమ్మాయి..
అనగనగా మరో అమ్మాయి .. నిండుగా, హుందాగా , నాకిది నచ్చలేదు అని మొహం మీద చెప్పినా , అవునా అంటూ అర్థం చేసుకొనే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, నిలువెత్తు హ్యుమనిజానికి సాక్ష్యంగా..
మొదటి అమ్మాయి పేరు సాయి పద్మ, రెండో అమ్మాయి పేరు నిడదవోలు మాలతి ..!!
సుమారు , ఐదేళ్ళు ప్రతీ రోజూ ఒక మెయిల్ రాసుకొనే వాళ్ళం .. మాలతి అంటే , ఒక నా వయసు అమ్మాయే అనుకోని మా ఇంట్లో వాళ్ళు నీకు మాలతి చెప్తే సరే అనేవాళ్ళు ..హాస్యానికి . అప్పటికి నాకు ఇరవై నాలుగు. మాలతి గారికి అరవై పై మాటే … ఇది ఆమె వయసు చెప్పటానికి రాయటం లేదు . ఆమె మనసు ఎంత యంగ్ ప్లస్ ఎంత ఫాస్ట్ గా ఈ కాలానికి ఆలోచిస్తారు అని చెప్పటానికి రాస్తున్నాను .
మాలతి గారితో, నాది స్నేహమా, బంధమా, ఇష్టమా గౌరవమా అంటే .. సరిగ్గా చెప్పలేను. ఇష్టంతో, స్నేహం గౌరవం తో కూడిన బంధం అని చెప్పచ్చు – (సినిమా డైలాగ్ లా , కొంచం కన్ఫ్యూజన్ గా ఉంది కదా .. అంతే మరి ..)
ఇవాళ ప్రతీ అక్షరం రాసినపుడు , అది తెలుగు అయినా , ఇంగ్లీష్ అయినా ఆమె గుర్తుకువస్తారు . చాలా నేర్చుకున్నాను తన నుండి, అని చాలా కాలం తర్వాత అర్ధం అయిన సందర్భంలో .. నేను ఆమె గురించి ఇంగ్లీష్ లో రాసుకున్న ఆర్టికల్ కి ఇది తెలుగు అనువాదం –
తెలుగుతో, మనసుతో, మనిషితో, సాహిత్యంతో నిజ సంబంధం ఉన్న ప్రతీ వారికీ ….ఇవి ఉపయోగపడే కొన్ని సూత్రాలు అవుతాయని .. ఆశిస్తూ రాస్తున్న పోస్ట్ ఇది .. నేనిది రాసానని ఆమెకి ఎవరూ చెప్పద్దని మనవి .. !!

 

· భాషే సంస్కృతి, భాషని పోగొట్టుకుంటే సంస్కృతినీ, నీ ఉనికినీ కోల్పోవటానికి సిద్ధపడు

· హాస్యం ముఖ్యమైన జీవన సారం, .. కానీ రూమర్ కాని హ్యూమర్ సుమా

· నీ మనసెరిగిన పని ఎంచుకొని చేయి … అది ఇంకొరికి అప్పగించకు

· ప్రతీ కధలో రాయని, రాయలేని వాక్యాలు ఉంటాయి .. వాటిని గౌరవించు

· ఆడైనా, మగైనా, ఏ ప్రాణి అయినా …. స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది ..

· నువ్వు బ్రతకగలిగి, ఉంచుకోగలిగే వస్తువులనే .. దగ్గరుంచుకో

· చేసేది చిన్న పని కావచ్చు, కానీ శ్రద్ధతో, సహనంతో చేసిన ప్రతీ పనీ మంచి చేస్తుంది

· రాసే వాక్యాల్లో.. మిగతావారి అభిప్రాయాలు నువ్వు వోప్పుకుంటున్న దగ్గర నుండీ.. కొంత లిమిట్ దాటిన తర్వాత.. వాళ్ళు నిన్ను శాసించటం ఎంతో దూరంలో ఉండదు

· నువ్వు న్యాయ నిర్ణేతవి కావు- నీకు సరి అనిపించినది , ఇంకొరికి పూర్తిగా తప్పు అనిపించవచ్చు

· కథకులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం- వినటం

· నీ ఇబ్బందులు, బాధలు ఇవతలి వాళ్లకి ఇవ్వకు. వాళ్ళ సమయాన్నీ, ప్రైవసీ ని గౌరవించు.

· అనువాదం అనేది – తరాల భాషనీ, సంస్కృతినీ .. ఏకం చేస్తుంది . అది చాలా ముఖ్యమైన పని

· ఆరోగ్యకరమైన వ్యంగ్యం –భలే గొప్ప కళ

· ఒక చిన్న కధ, చిన్న వచనం, చిన్న చిరునవ్వు … ఒక్కోసారి పెద్ద పుస్తకాల కన్నా మేలు చేస్తాయి

· నువ్వు రాసే కధల, పదాల బట్టి నీ ఎచీవ్మెంట్ ఉండదు… ఎన్ని హృదయాలని నువ్వు స్పృశించ గలిగావు అనేదే నీ అచేవ్మేంట్.

· పొదుపుగా ఉండు. వ్యాయామం మానకుండా చేయి

· ఒక బంధం చావటం కన్నా మనిషి మరణం గొప్పది కాదు. ఏదన్నా పూడ్చే పని కూడా సరిగా చేయి

· నిరంతరంగా, ఇష్టంగా చేసే పని ఆనందమైన జీవితానికి తాళం చెవి …!!

 

నేను నేర్చుకున్న వాటిలో , గభాల్న గుర్తొచ్చేవి .. ఇవి .. నేర్చుకోవటం ఒక నిరంతర ప్రక్రియ .. ముఖ్యంగా ఒక సంపూర్ణ వ్యక్తిత్వం నుండి నేర్చుకోవటం అంటే .. !!
మనఃస్పూర్తి గురు పూర్ణిమ శుభాకాంక్షలు ..!!
–సాయి పద్మ
© Sai Padma ://IPR All Rights Reserved

14 thoughts on “నా లోని నేను – నేనూ- నిడదవోలు మాలతి గారూ ..!

  1. NS Murty అంటున్నారు:

    రాసే వాక్యాల్లో.. మిగతావారి అభిప్రాయాలు నువ్వు వోప్పుకుంటున్న దగ్గర నుండీ.. కొంత లిమిట్ దాటిన తర్వాత.. వాళ్ళు నిన్ను శాసించటం ఎంతో దూరంలో ఉండదు … So true.

    అనువాదం అనేది – తరాల భాషనీ, సంస్కృతినీ .. ఏకం చేస్తుంది . I agree. (అది చాలా ముఖ్యమైన పని) Disagree.

    ఆడైనా, మగైనా, ఏ ప్రాణి అయినా …. స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది … That is what every writer should acknowledge in the first place.

    Congrats to the Teacher-Student Pair.

  2. వాసుదేవ్ అంటున్నారు:

    “నీ మనసెరిగిన పని ఎంచుకొని చేయి … అది ఇంకొరికి అప్పగించకు “, “ఆడైనా, మగైనా, ఏ ప్రాణి అయినా …. స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది” స్వేచ్చ గురించి ఎంతచెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది…తిండి తర్వాత అతి ముఖ్యమైన వాటిల్లో ఇదొకటి. స్వేచ్చ గురించి ఆమె మిమ్మల్ని ప్రభావితం చెయ్యటంలోనే అంతా అవగతం. అభినందనలు. మంచి మాటలు పంచుకున్నారు.

Leave a reply to తమ్మి మొగ్గలు స్పందనను రద్దుచేయి