అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ’జాలం- సూఫీ చెప్పిన కథ-సాయి పద్మ రివ్యూ

download

శ్రీ కే.పీ.రామనున్ని రాసిన “ సూఫీ పరాంజే కథ’ ( మలయాళంలో ఈ నవల పేరు ) ని తెలుగులో శ్రీ. ఎల్.ఆర్ .స్వామి గారు ‘సూఫీ చెప్పిన కథ’ గా అనువాదం చేసారు . అది ఇప్పుడే చదివి ముగించాను . లేదు .. లేదు గత పదిహేను రోజులుగా ముందుకీ , వెనక్కీ చదువుతూనే ఉన్నాను . కథలోకి పూర్తిగా ములగబోయే ముందు కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి – ఈ కథ కి గాను రచయిత రామనున్ని గారికి కేరళ సాహిత్య అకాడెమీ అవార్డు, వయలార్ అవార్డు మరిన్ని అవార్డులు , రివార్డులు వచ్చాయి. దీన్ని సినిమాగా కూడా తీసారు. సుప్రసిద్ధ రచయిత శ్రీ ఎల్. ఆర్ .స్వామి గారు అనువాదం చేయగా, సారంగ బుక్స్ వారు దీన్ని పబ్లిష్ చేసారు . హమ్మయ్య.. వివరాలు చెప్పేసాను కాబట్టి, ఇక కథలోకి వెళ్దాం.

సమీక్షకురాలి ముందు మాట : ఈ మధ్య కాలంలో నన్ను ప్రభావితం చేసిన రచనగా నేను దీన్ని చెప్పుకోవచ్చు. కథనీ , హేతువాదాన్నీ, సూఫీ లాంటి ఒక మిస్టిక్ తత్వాన్నీ పక్కన పెడితే, స్త్రీత్వాన్ని గురించీ, లాజిక్కీ , రీజన్ కీ అందని మనిషి బలహీనతల గురించి, బలమైన మెటాఫర్ ల ద్వారా చెప్పిన కథ ఇది . ఈ రివ్యూ లో అభిప్రాయాలు, ఇష్టాలూ, అయిష్టాలూ అన్నీ నావే. నాకు అర్ధమైనంతవరకూ రాసుకున్న ఈ రివ్యూ ని మీకందరికీ నచ్చుతుందని , కొన్ని కోణాలు తెలుగు సాహిత్య లోకం అర్ధం చేసుకుంటుందని అనువాదకులు నిజాయితీ గా చేసిన ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను.

క్లుప్తంగా కథ: పొన్నాని గ్రామంలో వెలసిన ఒక బీవి హిందూ, ముస్లిం మతస్తులతో సమానంగా పూజలు అందుకుంటోంది అనే ఒక పద చిత్రంతో ఈ కథ మొదలవుతుంది . అక్కడ ఆ బీవి జలసమాధి అయిన చోట ఒక దర్గా ఉంటుంది. కేరళలో ప్రసిద్ధమైన ఒక మీనోన్ ల తరవాడు (ఇంట)న పుట్టిన ఒక సౌందర్య శక్తి రూపం కార్తి కథ ఇది . నిజానికి ఈ కార్తి మనిషి లోని సౌందర్య దాహానికి, శక్తికీ , స్వచ్చతకీ ప్రతీక. కార్తి పుట్టగానే జాతకం చూసిన మావయ్య శంకు మీనోన్ అన్య కులస్తుడితో సహవాసం చేసి , తరవాడు వదిలి వెళ్ళిపోతుంది అని తెలుసుకుంటాడు. అయినప్పటికీ, దిన దిన ప్రవర్ధమానమవుతున్న మేనకోడలి సౌందర్యానికీ, అందులోని శక్తికీ శలభం లాగా , దగ్గరవుతూ, దూరమవుతూ దోలాయమానం గా ఉంటాడు. ఇంట్లో ఉన్న ఆకర్షణ కి లోలం అవుతూ ఉంటాడు . ఆమెకి నెమ్మదిగా మానసికంగా ఒక రక్షకునిగా మారతాడు. అదే సమయంలో వ్యాపార నిమిత్తం వచ్చిన ముస్లిం వ్యాపారి మమ్ముటి తో కార్తి సన్నిహితం కావటాన్ని నిస్సహాయంగా గమనిస్తాడు. ఆమె, అతనితో వెళ్ళిపోతుంది అని ఊహించి , మనసుకీ , శరీరానికీ సంకెళ్ళు వేసుకొని , కార్తి ని గడప దాటనిస్తాడు. సర్వస్వం కోల్పోయిన వాడిగా మిగులుతాడు. మమ్ముటి తో సంగమించి పొన్నాని గ్రామం చేరుతుంది కార్తి. మతం మార్చుకొని అతను పెళ్లాడని అతని భార్యగా, సహజీవనం చేస్తూ , అతని కుటుంబం తో ఉంటుంది . హిందూ అయిన కార్తిని, తెలీకుండానే ఒక ఆరాధ్య భావంతో చూస్తుంది మమ్ముటి చెల్లెలు అయేషా . కార్తి ముస్లిం లోకి మతం మార్చుకుంటుంది. కానీ జన్మతః వచ్చిన హిందూయిజాన్ని మరువలేకపోతుంది. దేవతా విగ్రహం మమ్ముటి ఇంట్లో దొరకగానే , దానికి పూజలు ప్రారంభిస్తుంది . భార్య మీద ఇష్టంతో ఇంట్లోనే గుడి కట్టిస్తాడు మమ్ముటి. దానితో, వూరు మమ్ముటి ని వదులుకోలేక, అతను చేసిన పనిని ఇష్టపడలేక, ఒకానొక మత సందేహాలతో , సతమతమవుతుంది. కార్తి, సౌందర్యాన్ని, దానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని, ఆపదల్ల్లో ఆమె చూపించిన శక్తిని కళ్ళారా చూసిన మమ్ముటి , ఒక సంశయం నిండిన ఆత్మ న్యూనత కి గురి అవుతాడు. దైహికంగా, మానసికంగా కార్తి మళ్ళీ వొంటరిదవుతుంది. తన న్యూనతతో, ఆమెకి శారీరకంగా దూరమవుతూ , తనని తానే హింసించుకుంటూ వికృత చర్యలకి పాల్పడతాడు.ద్వేషించినా, ప్రేమించినా, కామించినా మనఃస్పూర్తిగా మాత్రమే చేయగల కార్తి జలసమాధి అయి .. బీవీ గామారి, పొన్నాని ప్రజల్ని రక్షిస్తూ ఉంటుంది.

కథలో నాకు నచ్చిన అంశాలు :

· భాష: అనువాదం ఎంత బాగుంది అంటే, మనం ఊహించని ఎన్నో కోణాల్లో వర్ణన సాగుతుంది. కవితాత్మక వచనం ఉండాలా వద్దా , మెటాఫర్ అనేది ఎక్కడ ఉండాలి అనే సందేహాలు … కడలి పొరల్లా ఒకటీ ఒకటీ విడిపోయి దారిచ్చినట్టు గా ఉంటాయి

· మనిషి జీవితం హేతువాదానికి అతీతం . అది మార్మికం కావచ్చు, మరేదన్నా మతం కావచ్చు. ప్యూర్ గా ఇది ఇక్కడినుంచే మొదలైంది. ఈ మతంలో మరే విషయం కలవలేదు అని చెప్పటం సాధ్యం కాదు.

· మానవ జాతిని నడిపించేది ఒకే ఒక మూల సూత్రం . దాని ఆధారంగానే మతాలు ఏర్పడ్డాయి. అవసరం కొద్దీ, బలహీనతల కొద్దీ అవి శృంఖలాలు గా మారాయి.

· ఆడదాని సౌందర్యం కన్నా …మగవాళ్ళని, మగ ఆలోచనలని , ప్రలోభపెట్టి , భయపెట్టేది .. స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసం, గిల్ట్ లేని వాళ్ళ సెక్సువాలిటీ ..!

· భాష వ్యక్తీకరణ లోని bondages ని చేదించ వలసిన అవసరం ఎంతైనా ఉంది

· ప్రకృతి , సహజీవనం కన్నా గొప్ప మెటాఫర్ లేదు

· సాహిత్యానికీ, భాషకీ .. కేవలం అనుభూతి మాత్రమే కాదు.. ఆఘ్రాణశక్తి కూడా ఉంది. ఈ కథలో , కడలి తీరం, ఉప్పు గాలి, చెమట వాసన , తరవాడు వంశాచారాల వదుల్చుకోలేని మశూచి , కార్తి సౌందర్యపు నిర్లజ్జా విత్తనాలు .. మన మనసులో సజీవంగా ఉంటాయి .

· కథంతా ఈ మెటాఫర్ ని మనం అనుభవిస్తూనే ఉంటాము.

నచ్చిన కొన్ని కవితాత్మక వాక్యాలు:

· ఒక నూతన వూహ మొక్క చిగురైనా భూమిపైకి పొడుచుకు రావటం మీరు వోప్పుకోరా ?

· పాతకక్షలేవో తీర్చుకోవటానికే అన్నట్లు ఆకాశంలో ఎదిగి ఎదిగి పగిలి పడిపోయిన మబ్బుల స్తంభాలు మా సముద్ర తీరాన్ని కొరికి మింగేసాయి.

· దర్గాలో చిరువేచ్చని నూనెలో కాళ్ళు చేతులు కొట్టుకొని అనుభావమండిన నేను ఒక పసిపిల్లవాడిగా మారాను.

· పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఒక ఫలప్రదమైన మెట్టు ఎక్కినట్లు తోచింది; ఆ ఇంటి వారికి

· స్మృతి యొక్క రసాయనిక విశ్లేషణ వదిలిన పొగగా అది , ఆత్మలో చేరి నాచు కట్టింది.

· ఐశ్వర్యానికి గతకాలపు ఆలోచనలు ఉండవు. నువ్వు నది దాటి వచ్చిన వాడివి.

· ఏడవాలని అనుకున్నప్పుడు ఏడవటం, స్నేహించాలని అనుకున్నప్పుడు స్నేహించటం, కామించాలని అనుకున్నప్పుడు కామించటం ఆమె కి సాధ్యమే… ఆమెకి ఆ ధైర్యం ఉంది .

హిస్టరీని , మన మూలాల మిస్టరీని కలిపి రాసిన ఈ కథ , అనువాదం రెండూ గొప్పగా ఉన్నాయి . హిందూ, ముస్లిం మతాల లోని సదాచారాల, దురాచారాల మూలాలు కొన్ని తెలుసుకున్నప్పుడు , అంతా ఒకటే కదా , అయినప్పటికీ ఎంత రక్త పాతం, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని కోరికల కొత్త సమాధులో కదా..!! హ్మ్మ్ ..!

ఈ కథలో అర్ధమైన మరో కోణం, స్త్రీ తన సెక్సువాలిటీ ని ఏ సందేహమూ లేకుండా అక్సేప్ట్ చేసి, explore చేసిన మాతృ స్వామిక సమాజాల లో కూడా పురుషునికి నీడగా మారని స్త్రీ నీ, ఆమె ఆత్మ విశ్వాసాన్నీ , పురుషుడు సందేహిస్తూ , ఆమెని మరింత వొంటరితనం లోకి నేట్టేస్తూనే ఉన్నాడు ..!

మొత్తానికి.. ఈ అనువాద నవల మన అణువణువులో వెదజల్లిన సాహిత్యపు, కవితా విత్తనాలు మాత్రం నివురులాంటి చివురులు వేయటం .. కథల్లో మెటాఫర్ ప్రయోగం పట్ల నాకు అంతులేని ప్రేమా, సాహిత్య ప్రయోజనం ఒక కార్తి అనే బీవి వల్ల ఏర్పడింది ..అనేది మాత్రం నిర్వివాదాంశం…!!

Lastly, the identity/genesis/purity of a religion or any form of practice.. Stood on its glorious ground without much constructive debate as long as it’s based on equality and on the foundation of humanity.. When there are cracks in such foundation by curtailing naturalness of human desires by hiding their weaknesses and portraying their fake strengths … there looms collapse of any religion which leaves room for world class literature… Ironically..!!

ప్రముఖ అనువాదకులు స్వామి గారికి నా అభినందనలూ, ధన్యవాదాలు కూడా ..! సారంగ బుక్స్ వాళ్ళు వేసిన ఈ పుస్తకం నవోదయ షాప్స్ అన్నిట్లో దొరుకుతోంది . వెల 75 రూపాయలు.

–సాయి పద్మ

( ఈ రివ్యూ మాలిక పత్రికలో వచ్చింది. ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే, ఈ అనువాదానికి గాను ఎల్. ఆర్ .స్వామి గారికి, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంతకంటే , శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలీక…)

స్వామి గారికి మనః పూర్వక శుభాకాంక్షలు..!!

మీ

సాయి పద్మ

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

2 thoughts on “అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ’జాలం- సూఫీ చెప్పిన కథ-సాయి పద్మ రివ్యూ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s