నెప్పుల నెమలీకలు..!!

gaia[3]

 

పల్చగా సుతారంగా, కేవలం స్పర్శ మాత్రమే కాదు నెప్పి కూడా ప్రయాణిస్తుంది.. ఒకానొక సమయంలో సహస్ర ఘంటికానాదం గుండెల్లో కొట్టుకొని, తెగని శ్లేష్మంలా ఎంత ఇబ్బంది పెడుతుందో, ఆగక చూసే కాంక్షా చూపులా బాధ ఎంత బాధిస్తుందో చెప్పలేము..

కలుస్తారు ఎవరో, నమ్మకంగా చెప్తారు, నెప్పిలో కూడా నీతోడుంటాం అని.. ఎలా ఉంటారో అర్ధం కాకపోయినా వినటానికి బాగుండి, కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ భావం కొంచం ఎక్కువ అవగానే, కొంచం భారంగా ఉంటుంది, మరో కొత్త నెప్పి మొదలవుతుంది. ఎందుకొచ్చిన ప్రయాసలే ఇదంతా !

ఆణువణువూ విచ్చుకోవటం, శృంగారంలోనే కాదు, శారీరక బాధలో కూడా తెలిసొస్తుంది. అలాగే ఉన్నాడో లేడో తెలీని దేవుడి జాడ కూడా.. కనబడని దేవుడు , వినపడని ఆకాశవాణి , నరనరాన ముంచేసి … కదనరంగం చేసే ఒకానొక సమయాన … భలే యాతన వంటి నవ్వు కూడా వస్తుంది …

నిజమే.. మానసిక బాధ ముందు శరీరం ఏముంది ? ఈక ముక్క అంటారా ? కానివ్వండి. కొత్తగా చెప్పేదేముంది.. ఒక్కోచోట ఒక్కోబాధ, ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ,

వొళ్ళంతా నేప్పెట్టే సూదుల మయమై, మనమంటే శరీరమే అనిపించే ఓ క్షణాన .. పొడి దగ్గు కి ఒకటే హడావిడి పడి మందు తీసుకుంటున్న స్నేహితురాలిని అడిగాను.. ఎందుకంత గాభరా పడుతున్నావు? కొంచం టైం ఇవ్వు తగ్గుతుంది’ నా టైప్ మోటివేషన్ కొంచం అరగదీసి పోసి, నేనేదో ఇరగదీద్డామనుకున్నా..!!

సిగ్గుపడి, మొహమాటపడి, అసహ్యపడుతూ చెప్పిందామె… నన్ను దగ్గరకి తీసుకుంటే , నా దగ్గు మావారి మూడ్ ని పాడుచేస్తోందట.. తిట్టే తిట్లకు, ఎదిగిన పిల్లలముందు అభాసు అవుతోంది..

ఆహా ..ఆడతనమా, నువ్వంటే ఎంత మర్యాద! ఆహా మనిషితనమా, మగాళ్ళకి వచ్చిన దగ్గులు వొగ్గు కథలు కాబోలు, ఓ రెండు తగిలించాలన్నంత కోపం వచ్చింది. దగ్గు రావటం ఏదో , పాతివ్రత్యం లా కనబడని విషయం కోల్పోయినట్టు బాధ పడుతున్న ఆ ముగ్ధ సుందర నారీమణి ని చూస్తే, తరతరాలుగా మేము బానిసలమే, కుక్క గొలుసులాగ, సూత్రపు పటకా అక్షయ తృతీయ నాడు కొనుక్కున్నామంతే అని .. ఇల్లెక్కి కూస్తున్న మోడరన్ మహాలక్ష్మిలను తలచి, వగచి, గతించితిని..!!

నెప్పి సీతాకోక చిలుక లాంటిది కూడా… భరించలేని లార్వా దశ భరించాలంతే … మూలన పెట్టి మూల విరాట్వి , మూల పుటమ్మవి అంటూ మెడ పాశాలు పెడుతూ ఉంటె భరించటం లేదూ.. ఇది కూడా అలాంటిదే..!!

కొన్ని నెప్పులు నెమలీకల లాంటివి, ఎంత సమయం పుస్తకాల్ల్లో పెట్టినా ,అలానే ఉంటాయి. పిల్లలు పెట్టవు, అది ఎంత పెద్ద హాయో అనుభవిస్తే గానీ తెలీదు..!!

Starry Night Body Paint - Woman Graffiti Body Painting

చురుక్కుమనిపించే మాటల తోటల్లో, రాలిన పిందేల్లా

అపర్ణాహ వేళల్లో, కళ్ళముందు కదలాడే నిశిలా

శరీర స్పృహ తెలిసే నెప్పులు , కాస్సేపు మనసు మనస్సాక్షి లాంటి

పడికట్టు మంత్రజాలాల్లోంచి మనల్ని బయట పడేస్తాయి

శరీరం లేనిది మనసెక్కడుంది?

చెంపదెబ్బ కొట్టి , మాటలతో అనునయిస్తే

నేనే , సర్వ జగన్నియామక భవానీ భర్గ పాదాంబుజ ధ్యానైకాత్మికనేని ..

ఇలా ఎన్ని శపధాలు చేస్తే ఏం లాభం ?

అర్ధమవుతోందా… శమించని శరీరమా ?

–సాయి పద్మ

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్న నా నువ్వు ..!

img_0913-Copy

ఎక్కడో చూసినట్టే ఉంది నిన్ను ..

పులుసు కలయబెడుతూనో, వెల్లుల్లి సరిపోతుందో లేదో అని ఆదుర్దా పడుతూనో

చిక్కగా చిక్కడిన దారపురీలుని సవరదీస్తూనో,

తటాల్న విసిరే మాటల గాయాలకి మందు రాసుకుంటూనో

మోకాళ్ళ నెప్పుల నిప్పుల గుండం కుంటుతూనో

అరిచేతుల ఆవిరైన స్వర్గాల పెళుసులు నిమురుతూనో

 

ఎక్కడో విన్నట్టే ఉంది నీ మాట

సుళ్ళు తిరుగుతున్న సంగీతం హటాత్తుగా ఆగిన అపశ్రుతి లా

అరిగిపోయిన మంగళసూత్రంలో విరిగిపోయిన లక్క శబ్దంలా

జవాబు తెలిసీ మాట్లాడని భేతాళిని లా ,

నీ కళ్ళల్లో నీ మాట వినపడుతూనే ఉంది

అత్యంత రుచికరమైన నీ అసహనపు తిరగమోత లయలా

 

ఎక్కడో కలిసినట్టే ఉన్నాను నిన్ను

వోద్దిగ్గా మడతపెట్టిన కుర్చీలో, జాగ్రత్తగా సర్దిన పేపర్ల మధ్య

జయజయధ్వానాల చప్పట్ల కీర్తి వెనుక సాయంకాలపు నీరెండలో

వొంటరిగా వచ్చిన పేరెంట్స్ మీటింగుల్లో , నిరామయ జంట చేతుల చప్పట్లలో

నిర్లక్ష్యపు ఆహాలకు నలిగి, మూడంకె వేసిన మొహాల కన్నీటి మధ్య

బితుకు బితుకు మంటూ కలిసీ కలవని పాత స్నేహితుల మాటలలో

 

చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్నాను నిన్ను

ఇక్కడే , ఎప్పుడూ, నీ మేధో సమాధుల్లో

మెదడు దాచిన మేకపు తళుకుల మధ్య

నీరవమైన జీవోత్సాహపు చిరుచెమటల మెరుపుల వరుసల్లో

సమాధానపడుతూ, నువ్వు నమ్మినట్టు నటిస్తున్న నీ కవితల పంక్తుల్లో ..!!

–సాయి పద్మ

Wells05_0

 

© Sai Padma : IPR All Rights Reserved

వి’చిత్ర లిపి

1609012_604845816254476_1471075915_n

కొన్నిటికి లిపి అవసరం కాదు

చుక్కల వెంట పరుగెత్తే చక్కటి కళ్ళు

మాటల మధ్య నిశ్శబ్దం లాంటి మట్టి

సాలోచనగా ఆగిన పాదాల పగుళ్ళు

 

నల్లటి చిత్రాకాశం మీద వేసే చిక్కటి ముగ్గు

వొగ్గులా మిగిలిన బామ్మగారి గతపు ముగ్గులు

వాడేసిన చీపుర్లూ, పగిలిన బుగ్గల అందాల నవ్వులు

నేలమ్మ మీద ముగ్గేసిన శుభోదయానికై

వేచే సూరీడయ్య హడావిడితనాలు

 

వెలగని దీపాల చిత్రిస్తూ  వెలిగే నవ్వుల కాంతులు

కొన్ని చుక్కలతోనే , చుట్టబెట్టే రంగుల హారతులు

గడపేదైతే ఏంటి ? ముగ్గేసి సమానం చేస్తామంటున్న

సిగ్గందాల మొగ్గల ధీరపు సమాధానం

 

కొన్నిటికి లిపి చాలా అవసరం

ఎందుకంటె ..

అసంపూర్ణ చుక్కల చిక్కుముళ్ళను

రంగవల్లిక చేయటమే కదూ జీవితం ..

ఎవరన్నారు ? ఇది చిత్రలిపి మాత్రమే నని

ఇది విచిత్రాల మనో వాకిళ్ళ కల్లాపి ..!!

–సాయి పద్మ  1608901_604845552921169_1811821786_n

 

( కందుకూరి రమేష్ బాబు గారి ‘చిత్ర లిపి’ ప్రదర్శన ఫోటోలు చూసి , రాసినది. కొన్ని లోగిళ్ళ జీవన సౌందర్యాన్ని అసామాన్యంగా సామాన్యం చేస్తున్న ఆయనకు ధన్యవాదాలతో )

ఎలా ఉన్నావు ?

k-bigpic

నీ ఆత్మకైన నిన్నటి పచ్చి గాయాల్ని అలానే వదిలేసి ,

క్షణంలో పెదాల మీద చిరునవ్వు పరిచేసి

అతకని మేకప్ వెనుకాల జీవితాన్ని దాచుకొని

అక్షరాన్ని హడావిడిగా చీరలా చుట్టుకున్నదానా

ఎలా ఉన్నావు ???

 

ముళ్ళ పందిరి విమర్శల ,కుహనాతనపు పాతివ్రత్యాల

రోజువారీ బజారు బేరాలలో , బీరాలు పలికే

నీ బంధు దళారీల విఫణి మాటల్లో

వినిపించే విషాన్ని కాటుకెట్టిన దానా

ఎలా ఉన్నావు ???

 

ఆవిరయ్యే ఆశల శీతగాలుల పగుళ్ళలో

ఆహాలని చర్మంగా జీవించే సొంతవాళ్ళ మధ్య

నీ అస్తిత్వాన్ని అతి తత్వంగా మార్చిన మాయాజాలాల్లో

వాడిన విరుల దండల్ని ధరించినదానా

ఎలా ఉన్నావు ???

 

నామమాత్రపు ప్రేమని , పిండ ప్రదానం చేసి

శాఖా చంక్రమణాల మొహాన్ని నీ మొహాన్నే విసిరేసి

అగణిత, అప్రాప్త కీర్తి కన్యకకై అర్రులు చాచే ప్రియునికై

అభిసారికై , సారె సారెకూ , సతమతమై వేచినదానా

ఎలా ఉన్నావు ???

–సాయి పద్మ can_you_feel_it__by_lhianne-d62i2pe

దైనందిన వత్సరం

2013102720855-picture-happy-new-year-2014-hd-wallpaper

నాచుపట్టిన నీతి సూత్రాల జారుడుబల్లల మీద , కొత్త స్వాగతాలు పలుకలేక పోయాను

మనసారా ఆనందించడానికి మరో మనిషి అక్కర్లేక భలే సుఖపడ్డాను

సుఖానికీ, సంతోషానికీ మధ్య మార్కెట్ గీసిన గీతలు నాకోసం మాత్రం కాదు

ఎదగటం కూడా వొదగటానికే అని చెప్పే అణచివేత అలల్ని

బంగాళా ఖాతంలో నిమజ్జనం చేసాను

మనసుకీ, మేధకీ జరిగే ఎన్నికల్లో

మనసుని ఏకగ్రీవంగా గెలిపించి మురిసిపోయాను

అందుకే ఈ మరో వత్సరం కళ్ళల్లోకి ధైర్యంగా చూడగలుగుతున్నాను

స్వాగతం .. నూత్న వత్సరమా ..

నా నడవడికల దైనందినం లోనికి .. !

–సాయి పద్మ

14188529-happy-new-year-2014-colorful-painting-of-hands1

నువ్వెళ్ళిన తర్వాత ..

AMMA

 

మరణం ఒక సంవత్సరం ఒక రోజంటారు… కానీ ఇంత దీర్ఘంగా వొక రోజు ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు .. కణకణంలో నీ జ్ఞాపకం మండుతూనే ఉంది .. రానీ రానీ కోపాల్ ..తాపాల్ …మనిషుంటేనే కదా కోపమైనా తాపమైనా .. అన్నట్టు .. మీరజాలగలడా నా యానతి .. పాట సరిగ్గా నేర్చుకున్నా ..ఎప్పుడొచ్చి వింటావో ఏమిటో .. !

ప్రేమ ఆప్షనల్ , బంధం కండిషనల్ కదూ .. నీ పెదవి దాటని అరనవ్వు నిశ్శబ్దంతో ఇన్ని మాటలు ఆడగలవని అస్సలు తెలీదు సుమా.. ఇంత గొప్పగా చిటికేసి మరణభయం లేకుండా వెళ్ళిపోవటానికి నీ పూజల్లో యేవో మంత్రాల మాత్రలు కలిపే ఉంటావు .. అవేమిటో చెప్పవూ .. ?

కుళ్ళు గుమ్మడికాయ దానం చేసావా .. ఇలాంటి పిల్ల పుట్టింది అంటే… నా పిల్ల మొహమే చాలు ..రాజ్యాలు ఏలటానికి అంటూ ధైర్యంగా జవాబిచ్చి … నీ అంత పిల్లని ఎత్తుకు తిరిగినప్పుడు ఉన్న ధైర్యం .. ఆలోచనల, జ్ఞాపకాల అస్థిపంజరపు భయంగా , బ్రతికుండగానే ఎప్పుడు మారిందో గమనించనే లేదు కదూ ..?

ప్రతీ వాళ్ళు రాసే అక్షరాల కుప్పల వెనుక ఎవరున్నారో నాకు తెలీదు గానీ.. నా ప్రతీ ఆలోచన వెనుక, నువ్వు చెప్పని ఒకానొక భావం ఉందని నాక్కూడా ఇప్పుడే తెలుస్తోంది… పండులా పుట్టి, పక్షవాతం సోకినప్పుడు .. తన మెదడు , హృదయం సరిగ్గా ఉంటె చాలు అని ప్రార్థించారట కదా … నువ్వు, నాన్నగారు ..!

అవయితే ఇప్పటివరకూ సూపర్.. నువ్వు మిగిల్చి వెళ్ళిన పని, నెరవేరని నీ మౌనపు ఆశయాలు.. నడవలేని ఈ కాళ్ళని ఒక్కో అడుగూ వేయిస్తాయేమో… చూద్దాం ..!

నువ్వున్నప్పుడు నీ మాటలకి అలిగి … లేనప్పుడు నీ నిశ్శబ్దానికి అలవాటు పడుతున్న ..

నీ

పద్మ

 

Sai Padma :// IPR All Rights Reserved

డొల్ల జీవితాల క్రాస్ సెక్షన్ కధలు -రంగుటద్దాల కిటికీ

image

ఎస్. నారాయణస్వామి రాసిన ‘రంగుటద్దాల కిటికీ’ కధల సంపుటి ఈ మధ్యనే పూర్తి చేసాను. ప్రవాసాంధ్ర రచయతుల ఫై నాకు కాస్త తేలిక భావం వుండేది. తేలికభావం వారి ప్రజ్ఞ మీదకానీ కౌశలం మీదకానీ కాదు, వాళ్ళు రాయకుండా వదిలేసే విషయాలపై ….!! ప్రవాసంలో జీవితాల్ని గడుపుతున్నవారు, వారు అనుభవిస్తున్న రకరకాలయిన అనుభూతుల్ని, అనుభవాలని, వాటిలో ఉన్న గాఢతనీ చేయల్సినంతగా సాహిత్య పరం చేయలేదన్నదే నా ప్రధాన ఆరోపణ. నారాయణస్వామిగారి కధలు చదివిన తర్వాత సవినయంగా, నా అభిప్రాయం తప్పు అని ఒప్పుకోక తప్పదు. అమెరికాంధ్ర జీవితాల్లోని డొల్లతనాన్ని నిష్పాక్షికంగా, ఇంకా చాలా ప్రేమతో చిత్రిస్తూ రాసిన కధలివి.
స్వామిగారి కధలు చదువుతూ వుంటే కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్యాలు గుర్తుకువస్తున్నాయి –“కధ క్రాస్ సెక్షన్ అఫ్ లైఫ్ – ఏ చెట్టు బెరడునో మైక్రోస్కోప్ కింద పెట్టగానే దాని బాక్ గ్రౌండ్ అంతా తెలిసిపోతుంది. అట్లా వుండాలి కధ..!!” ఈ కధల సంపుటిలో ఉన్న చాలా వరకు కధలు కో.కు. గారి ఈ వాక్యాలతో సరిగ్గా అతికినట్టు సరిపోతాయి. ఇదే సమయంలో Arms Length దూరంలో పాత్రలని చూసి కధలో ఎ పాత్ర పట్ల ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు, Value Judgements కనబడవు. కనబడేదల్లా కధాప్రక్రియ మీద అమితమైన ప్రేమ మాత్రమే. దీనికి మంచి ఉదాహరణ ‘ధీర సమీరే,’ ‘కళాకారుడికి కావలసింది,’ ‘చక్కనిచుక్క,’ ‘వీరిగాడి వలస’ – ఇలాంటి కధలు.
ప్రస్తుతం మనం మన మనసులతో మనమే పరాయికరణ యుధ్ధాలు కొనసాగిస్తున్నాము. దేశానికీ దేశానికీ పడదు. ప్రాంతం ప్రాంతానికి పడదు. అలాగే సంస్కృతికి సంస్కృతికి అసలు పొసగదు. ఎంతో చదువుకున్నవాళ్ళు, తెలివైనవాళ్ళు అనుకునే సమూహాలు సాటి మనిషిని సమానంగా చూడడం అనే విషయానికి వచ్చేసరికి ఎంత సంకుచితంగా, స్వార్ధంగా ప్రవర్తిస్తారో ‘తుపాకీ,’ ‘ఇండియన్ వేల్యూస్,’ ‘ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి,’ ‘ఖాండవవనం’ – ఇలాటి కధలు చెప్తాయి.
హాస్యం రెండువైపుల పదునున్న కత్తి లాంటిది. అందునా ఒకళ్ళు నమ్మి ఆచరిస్తున్న, పైగా మూడాచారాలుగా మారిన సున్నితమైన విషయాలకు వ్యంగ్యం, ఆరోగ్యకరమైన హాస్యంతో నగిషీలు చెక్కాలంటే వాక్యంలో గాఢత, క్లుప్తత అవసరం. అవి స్వామిగారి కధల్లో పుష్కలంగా వున్నాయి. దానికి మంచి ఉదాహరణలు ‘నీవేనా నను తలచినది,’ ‘డిటెక్టివ్ నీలూ,’ ‘అత్తగారితో కొత్తకాపురం,’ ‘కూపస్థ మండూకం,’ ‘నిరసన.’
అన్నట్లు ఈ కధల్లో రాంబ్లింగ్స్ కూడా ఉన్నాయండోయ్… మనిషిలోని ఎన్నో psychological కోణాల్ని, నిస్సహాయతని, అణచివేతని. మనోమధనాన్ని చెప్పకనే చెప్పే ఈ అచేతనా వాక్యాల స్వగతం నాకు భలే నచ్చింది. దీనికి మంచి ఉదాహరణలు ‘ఒక తల్లి గొడవ,’ ‘పూర్వజన్మ వాసన,’ ‘ఒక జనవరి శుక్రవారం లోకస్ట్ వాక్ కార్నెర్ లో’ – నిత్యం ట్రాన్స్మిషన్ మోడ్ లో వుండే మనుషుల స్వభావానికి, గ్లోబలైజేషన్ మనుషుల ఫై వదుల్తున్న అయోమయం, ఆందోళనకీ ఈ రంగుటద్దాల కిటికీ మిర్రర్ ఇమేజ్.
ప్రస్తుతానికి out of print లో ఉన్న ఈ పుస్తకం కినిగెలో e book గా దొరుకుతుంది. గ్లోబలైజేషన్ కలలు ప్రపంచ వ్యాప్తంగా కూలుతున్న నేపధ్యంలో ఇలాటి కధలు ఇంకా రావలసిన అవసరం వుంది. కధాప్రక్రియ మీద ఎంతో passion ఉన్న నారాయణస్వామిగారి లాంటి వాళ్ళు కధలు రాయడం తగ్గించడం ఒక అన్యాయకరమైన విషయం. మానవ జీవితంలో positiveness ని నిష్పాక్షికంగా రికార్డ్ చెయ్యగల కధకులు తగ్గితే డార్క్ ఫిక్షన్ కి, Victimization మరియు Negative Fiction కి కొత్త తలుపులు తెరిచినట్లే. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
ఎందుకంటే కావ్యేషు నాటకం రమ్యం అయితే కధేషు జీవానుభవం రమ్యం అని నమ్మే మనుషుల్లో నేను కూడా ఒక దాన్ని కనుక..!!
–సాయి పద్మ

 

Sai Padma :// IPR All Rights Reserved

మెరిసే చుక్కల ‘చందమామ రావే’ – సాయి పద్మ సమీక్ష

1146652_642058152495820_864787420_n

 
గీతాచార్య, శతఘ్ని ఈ పేర్లు ఫేస్ బుక్ తో పరిచయం ఉన్నవాళ్ళకి బాగా తెలిసిన పేర్లు. ఇద్దరి పేర్లు ఒకే బుక్ మీద కనబడేసరికి భలే కుతూహలం వేసింది . గీతాచార్య పేరుకి తగ్గట్టు , గీతోపదేశం , వ్యంగ్యం హాస్యాల కలబోత … ఇకపోతే శతఘ్ని కూడా పేరుకి తగ్గ మనిషే… పేలితే అది గుండు కాదు .. శత శతఘ్నుల సమాహారమే ..
ఈ బుక్ మొదట చూడగానే నన్ను నిరాశ పరచింది, అదే సమయంలో ఒక ఉత్సాహం కూడా కలిగింది .. ఆ బుక్ లేఅవుట్ చూడగానే పిల్లల పుస్తకమా అనే ఒక నిరాశ, కవర్ పేజీ మీద ఇద్దరు రచయితల పేర్లు చూడగానే కలిగిన ఒక ఉత్సాహం. ఎందుకంటె , కోలాబరేటివ్ రైటింగ్ వెస్ట్ లో కొత్త కాకపోయినా , మన ఇటలీ అఫ్ ది ఈస్ట్ ( అదేనండీ.. మన తెలుగు) లో తక్కువే .. ఎప్పుడో అక్కడా అక్కడా చూడటం తప్ప .. ఇద్దరు రచయితలు వోద్దిగ్గా రాసిన దాఖలాలు లేవు . ప్రతీ తెల్గూ గై గ్రేటే కానీ ప్రతీ తెల్గూ గ్రూప్ అంత గ్రేట్ కాదు కాబట్టి .. గీతాచార్య భాషలో చెప్పాలంటే కుంచం ఐసు బిప్స్ స్టోరీ లాగా .. ఒకటే కంచం, ఒకే మంచం స్నేహాలకి కూడా , అహం, ఆడపిల్లల స్నేహం అడ్డొస్తుంది కాబట్టి .. నేను నిజంగానే ఇద్దరు కలిసి రాసారా అని ఆశ్చర్యపోయా ..!
నెమ్మదిగా బుక్ లోకి వెళ్లాను.. అదొక ప్రపంచం, గీతాచార్య , శతఘ్ని ల నిజాయితీ ప్రపంచం.. అయిబు పాడిన అమ్మపాట , తనని తాను అనకొండ అనుకుంటూ , ఒక వెంట్రుక సాయంతో పరీక్షలు గెలిచే, గీతాచార్య కొంటెతనం … ద్వంద్వ ప్రమాణాల సమాజంపై విసిగి .. వూరి చివర మాత్రమే బ్రతుకుతున్న దేవతల వ్యధార్త గానం ..!!
ఒక క్రికెట్ చంటిగాడు, కొన్ని వింబుల్డన్ విలేజీ కబుర్లు, అయాన్ రాండ్ సాయంతో నేర్చుకున్న జీవిత పాఠాలు .. చెప్పాలంటే అన్నీ విలువైనవే ..అన్నీ ఆ వయసులోని తెలివైన పిల్లల మేధో మధనంలోంచి పుట్టినవే ..ముఖ్యంగా గీతాచార్య రాసిన వింబుల్డన్ విలేజీ రూల్స్ .. సెరెనా విలియమ్స్, ఫెడెరర్ .vs. నాదల్, మైకేల్ స్టిచ్, మోనికా సెలెస్ మీద రాసిన వ్యాసాలు చదువుతుంటే నాకు అనిపించింది ఒకటే .. స్పోర్ట్స్ సాయంగా వ్యక్తిత్వం, శారీరక, మానసిక దృఢత్వం నేర్చుకోవాల్సిన యువతరం , ఎక్కడో ట్రాక్ తప్పటం మూలాన చాలా అభద్రతా భావంతో ఉన్నారు అన్నది .. ఇవి చాలా వరకూ ప్రతీ కాలేజీ లో నేర్పాల్సిన విషయాలు … మంచి బాల్యమే కదా మంచి వ్యక్తిత్వానికి పునాది ..!
గీతాచార్య రాసిన ఆయిబు పాడిన అమ్మ పాట ఒక మంచి సర్రియల్ మోరల్ స్టోరీ.. తను కొంచం వాక్యం మీద శ్రద్ధ వహించాలి. ఎవరి మనసైనా ఆర్ధ్రమయే కథ అది ..!!
ఈ పుస్తకంలో ఎక్కువగా గీతాచార్య రాసినవే ఉన్నాయి .. అతని వ్యంగ్యం, హాస్యం, మారుతున్న కాలంలో వ్యక్తిత్వం ఎలా సంతరించుకోవలో చెప్పే వ్యాసాలూ, ఆలోచనలూ, రాజకీయ చతుర్లు. ఇందిరమ్మాస్… ఇలాంటివి చదివేటప్పుడు సరదాగా , తర్వాత మార్పు కోసం ఆలోచనలు రేకెత్తించేవిగా ఉంటాయి.
శతఘ్ని రాసిన కవితలు .. రాలేకాలంలో రాళ్ళేస్తవేమీరా ..కాలం గెలిచినా మానవుడు .. వోడిపోదాం రండి .. అతనిలోని జ్వలనాన్ని, మార్పు కి అభివ్యక్తించే కవినీ పట్టిస్తాయి. ముఖ్యంగా శతఘ్ని కవితల్లో చెప్పుకోవలసిన విషయం భాష .. ఎక్కడా కష్టమైన పదాలు వాడకుండా లోతైన భావాన్ని పలికించటం సామాన్యం కాదు .. చాలావరకూ శతఘ్ని బాగానే పేల్చారు అని చెప్పుకోవచ్చు. కానీ శతఘ్ని కవితల్లో ఉన్న predictability తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొంత వస్తు వైవిధ్యం అవసరం అని నాకు అనిపించింది.
ఒక మంచి భోజనంలా చందమామ రావే పుస్తకం ఒక Feel Good and Deep Thinking Delivered in a Capsule Form .. Guess Good Medicine Always does that and needed for Ailing Society ..!!
–Sai Padma

 

© Sai Padma :// IPR All Rights Reserved

డికాక్షన్ మనసుల ‘బియాండ్ కాఫీ – ఖదీర్ బాబు కధల్లాంటి సం’ ఘటనలు

BeyondCoffee                  

సాయి పద్మ రివ్యూ

కొంతమంది దగ్గర కొన్ని అద్భుతాలుంటాయి, వాటితో పాటు కొన్ని అవలక్షణాలు ఉంటాయి … కొన్ని బాలన్స్ అవుతాయి, కొన్ని డబ్బుతో, పవర్తో, మనుషులతో, అధికారంతో కప్పబడిపోతాయి. చక్కగా తయారు అయిన శరీరం వెనుక వొంటరితనం కొంతమందే పట్టుకోగలరు….ఖదీర్ గారి వాక్యం లాంటి ఎక్సరే కి ఆ శక్తి ఉంది.
ఇప్పుడే ‘బియాండ్ కాఫీ ‘ మరియు మరో తొమ్మిది కథల్లాంటి సంఘటనల బుక్ చదివాను. హైదరాబాద్ అనే అన్నం ఎలా ఉడికిందో చెప్పే మెతుకుల బ్రతుకుల సాక్ష్యం తో … సహా .. ! మనసు భారం అవుతుంది … దుర్గా మిట్ట కథల్లోని పిల్లాడి స్వచ్ఛత గుర్తొచ్చి …. కానీ ఏం చేయగలం .. పిల్లాడు పిల్లాడిగానే ఉండిపోడు కదా ( వహీద్ కథ )
లిక్విడ్ మోడర్నిటీ మీద ఆధారం చేసుకొని రాసే నవలికలు, కథలు తెలుగువాళ్ళకి కొత్త … కానీ కాఫ్కా ప్రభావంతో రాస్తున్న హరుకి మురకమీ (Haruki Murakami) లాంటి రచయితలు మోస్ట్ పాపులర్ డార్క్ రైటర్స్. ఖదీర్ కధలు ఒక కొత్త పంధా కి… ఇలాంటి డార్క్ కామెడీ, వొంటరితనపు కథలకి మొదలు అని నాకు అనిపించింది ( నేను చదివినంత వరకూ )
వొంటరితనం కీ ఏకాంతానికి మధ్య ఉండే మానసిక జాడ్యం ఖదీర్ బాబు ఈ కథల సారాంశం … కథల నిండా భయపెట్టే ఆడవాళ్ళు .. వాళ్ళ వొంటరితనం .. ఎవరూ ఎలుగెత్తి అరవరు…వాళ్ళ ఆసక్తి లేని చూపులు, ప్రదర్శించే కోపం, కామం, మనల్ని కొత్తగా భయపెట్టే అంశాలు ( మచ్చ, బియాండ్ కాఫీ కథలు ). కొంతమంది తమలో జరిగే, జరుగుతున్న ప్రభావానికీ , వొంటరితనానికీ , కుటుంబ పరంగా కోల్పోతున్న వాటికీ .. అందులోనే పరిష్కారం వెతుక్కొనేవాళ్ళు .. (ఘటన కథ) లేదా ..ఏ అవుటర్ రింగ్ రోడ్ ఘోరానికో బలైపోయి ఆగే వాళ్ళు, సాగే వాళ్ళు ( అపస్మారకం, ఇంకోవైపు కథలు )
హ్మ్మ్.. ఇవి ఇబ్బందికర నిజాలు.. కానీ .. నిజాలు .. రాసినందుకు శభాష్ అనాలో ….సుమారు దేశం అంతటా జరుగుతున్న విసర్జకం సాహిత్యంలోకి, కొత్త వ్యర్ధాల దారుల్లోకి …. అందంగా పవర్ఫుల్ గా వచ్చినందుకు విచారించాలో … డార్క్ శకానికి స్వాగతం పలకాలో … తెలీని .. అయోమయంలో ముగిస్తున్న రివ్యూ ..
చివరగా ఖదీర్ గారి లాంటి గొప్ప రచయితల గురించి నేను మాట్లాడేది ఏమీ ఉండదు .. గానీ.. ఒక రీడర్ గా .. ఒక కుతూహలపు ప్రశ్న .. వొంటరితనం , వెతుక్కోవటం, వాటి పీడ,బాధ .. ఆడవాళ్లకేనా .. మగవాళ్ళకి ఉండవా ..? ఈ మోడరన్ కాలంలో .. ప్రతీ వ్యక్తీ వస్తు ప్రపంచం వల్లా, అధికార సమీకరణాల వల్లా .. వచ్చి,తెచ్చి పెట్టుకున్న ఖాళీతనాల వల్ల .. జరిగే అత్యాచార బాధితులే .. అలాంటి వాళ్లకి .. ఏ వాదం లేని పరిష్కార మార్గాలు కూడా కావాలి .. లేకపోతే వాళ్ళు మళ్ళీ రచయితలకీ, తీరుబాటు ఉన్న లేదా లేని మరో వ్యక్తిని సోషల్ గా హింసించటం జరుగుతుంది .. ఆ మార్గాలు సూచనప్రాయంగా నైనా చెప్తే బాగుండేది ..!!
Finally… Life is NOT Just Beyond Coffee… It Sometimes Above Many Dark Skeletons Carefully Paraded as Fashion Icons..!!
ఈ పుస్తకం కినిగే లో దొరుకుతుంది ..!! లింక్ : http://kinige.com/kbook.php?id=2013

 

 

© Sai Padma :// IPR All Rights Reserved

నా లోని నేను – నేనూ- నిడదవోలు మాలతి గారూ ..!

image

 

అనగనగా ఒక అమ్మాయి .. ఎప్పుడూ ఒకటే పనితో, ఏదో చేయాలనే తపనతో … సగం చేస్తూ , సగం సాగలేని అమ్మాయి..
అనగనగా మరో అమ్మాయి .. నిండుగా, హుందాగా , నాకిది నచ్చలేదు అని మొహం మీద చెప్పినా , అవునా అంటూ అర్థం చేసుకొనే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, నిలువెత్తు హ్యుమనిజానికి సాక్ష్యంగా..
మొదటి అమ్మాయి పేరు సాయి పద్మ, రెండో అమ్మాయి పేరు నిడదవోలు మాలతి ..!!
సుమారు , ఐదేళ్ళు ప్రతీ రోజూ ఒక మెయిల్ రాసుకొనే వాళ్ళం .. మాలతి అంటే , ఒక నా వయసు అమ్మాయే అనుకోని మా ఇంట్లో వాళ్ళు నీకు మాలతి చెప్తే సరే అనేవాళ్ళు ..హాస్యానికి . అప్పటికి నాకు ఇరవై నాలుగు. మాలతి గారికి అరవై పై మాటే … ఇది ఆమె వయసు చెప్పటానికి రాయటం లేదు . ఆమె మనసు ఎంత యంగ్ ప్లస్ ఎంత ఫాస్ట్ గా ఈ కాలానికి ఆలోచిస్తారు అని చెప్పటానికి రాస్తున్నాను .
మాలతి గారితో, నాది స్నేహమా, బంధమా, ఇష్టమా గౌరవమా అంటే .. సరిగ్గా చెప్పలేను. ఇష్టంతో, స్నేహం గౌరవం తో కూడిన బంధం అని చెప్పచ్చు – (సినిమా డైలాగ్ లా , కొంచం కన్ఫ్యూజన్ గా ఉంది కదా .. అంతే మరి ..)
ఇవాళ ప్రతీ అక్షరం రాసినపుడు , అది తెలుగు అయినా , ఇంగ్లీష్ అయినా ఆమె గుర్తుకువస్తారు . చాలా నేర్చుకున్నాను తన నుండి, అని చాలా కాలం తర్వాత అర్ధం అయిన సందర్భంలో .. నేను ఆమె గురించి ఇంగ్లీష్ లో రాసుకున్న ఆర్టికల్ కి ఇది తెలుగు అనువాదం –
తెలుగుతో, మనసుతో, మనిషితో, సాహిత్యంతో నిజ సంబంధం ఉన్న ప్రతీ వారికీ ….ఇవి ఉపయోగపడే కొన్ని సూత్రాలు అవుతాయని .. ఆశిస్తూ రాస్తున్న పోస్ట్ ఇది .. నేనిది రాసానని ఆమెకి ఎవరూ చెప్పద్దని మనవి .. !!

 

· భాషే సంస్కృతి, భాషని పోగొట్టుకుంటే సంస్కృతినీ, నీ ఉనికినీ కోల్పోవటానికి సిద్ధపడు

· హాస్యం ముఖ్యమైన జీవన సారం, .. కానీ రూమర్ కాని హ్యూమర్ సుమా

· నీ మనసెరిగిన పని ఎంచుకొని చేయి … అది ఇంకొరికి అప్పగించకు

· ప్రతీ కధలో రాయని, రాయలేని వాక్యాలు ఉంటాయి .. వాటిని గౌరవించు

· ఆడైనా, మగైనా, ఏ ప్రాణి అయినా …. స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది ..

· నువ్వు బ్రతకగలిగి, ఉంచుకోగలిగే వస్తువులనే .. దగ్గరుంచుకో

· చేసేది చిన్న పని కావచ్చు, కానీ శ్రద్ధతో, సహనంతో చేసిన ప్రతీ పనీ మంచి చేస్తుంది

· రాసే వాక్యాల్లో.. మిగతావారి అభిప్రాయాలు నువ్వు వోప్పుకుంటున్న దగ్గర నుండీ.. కొంత లిమిట్ దాటిన తర్వాత.. వాళ్ళు నిన్ను శాసించటం ఎంతో దూరంలో ఉండదు

· నువ్వు న్యాయ నిర్ణేతవి కావు- నీకు సరి అనిపించినది , ఇంకొరికి పూర్తిగా తప్పు అనిపించవచ్చు

· కథకులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం- వినటం

· నీ ఇబ్బందులు, బాధలు ఇవతలి వాళ్లకి ఇవ్వకు. వాళ్ళ సమయాన్నీ, ప్రైవసీ ని గౌరవించు.

· అనువాదం అనేది – తరాల భాషనీ, సంస్కృతినీ .. ఏకం చేస్తుంది . అది చాలా ముఖ్యమైన పని

· ఆరోగ్యకరమైన వ్యంగ్యం –భలే గొప్ప కళ

· ఒక చిన్న కధ, చిన్న వచనం, చిన్న చిరునవ్వు … ఒక్కోసారి పెద్ద పుస్తకాల కన్నా మేలు చేస్తాయి

· నువ్వు రాసే కధల, పదాల బట్టి నీ ఎచీవ్మెంట్ ఉండదు… ఎన్ని హృదయాలని నువ్వు స్పృశించ గలిగావు అనేదే నీ అచేవ్మేంట్.

· పొదుపుగా ఉండు. వ్యాయామం మానకుండా చేయి

· ఒక బంధం చావటం కన్నా మనిషి మరణం గొప్పది కాదు. ఏదన్నా పూడ్చే పని కూడా సరిగా చేయి

· నిరంతరంగా, ఇష్టంగా చేసే పని ఆనందమైన జీవితానికి తాళం చెవి …!!

 

నేను నేర్చుకున్న వాటిలో , గభాల్న గుర్తొచ్చేవి .. ఇవి .. నేర్చుకోవటం ఒక నిరంతర ప్రక్రియ .. ముఖ్యంగా ఒక సంపూర్ణ వ్యక్తిత్వం నుండి నేర్చుకోవటం అంటే .. !!
మనఃస్పూర్తి గురు పూర్ణిమ శుభాకాంక్షలు ..!!
–సాయి పద్మ
© Sai Padma ://IPR All Rights Reserved