జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష..

image

ఈ మధ్య చదివిన చిన్న కథల పుస్తకాల్లో మంచి పుస్తకం ” జుమ్మా” .రచయిత శ్రీ. వేంపల్లి షరీఫ్. పుస్తకం కవర్ పేజి చూడగానే.. “అబ్బా! ముస్లిం కథల్లె!! తర్వాత తీరిగ్గా చదవొచ్చు! అనుకున్నా! .. కానీ పేజి లు తిప్పుతుంటే కనబడ్డ పేర్లు..తెలుగోళ్ళ దేవుడు..అయ్యవారి చదువు..అంజనం..పర్దా..ఆకుపచ్చ ముగ్గు ”  పేర్లు వినగానే చాలా కుతూహలం కలిగింది. నిజాయితీ గా చెప్పాలంటే..మనం అనబడే సో కాల్డ్ తెలుగోల్ల్లం కేవలం అత్తరు సాయబులనో..మటన్ కొట్టు నడిపేవాళ్ళు గానో మాత్రమే ఊహించుకునే..ముస్లింల కథ ఏమిటి? అనే స్పృహ మొదటిసారి కలిగింది.. దీనికి కారణం, నాకు తెలిసి..ఇవి కేవలం మైనారిటీ కథలు గా మాత్రమే కాదు..ఎక్కువ పబ్లిసిటీ ఉన్న ఇరాన్ ఇరాకీ సాహిత్యంగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఒక ఖలెద్ హోస్సేని నవలలకి గాని..ఇతరత్రా ఉన్న ప్రపంచ ముస్లిం సాహిత్యానికి గాని ఉన్న ప్రచారం ఈ కథలకు జరగక పోవడమే అనిపించింది చదివేకొద్దీ..

మనతోనే ఉంటూ..మన ప్రపంచానికి, ఆచారాలకి తప్పనిసరిగా అర్ధం చేసుకొంటూ…గడప తర్వాత గడపల్ల..ఉంటూ..తమదైన ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంతా సులువైన పది కాదని కూడా అనిపించింది.

కానీ..ఒక మంచి విషయం ఏమిటంటే..షరీఫ్ గారు..కేవలం ఇబ్బందులని,విషాదాలని, అంతర్లీనంగా తన పాత్రల ద్వారా చెప్పటమే కాదు…వాటికి వాళ్ళు వెతుక్కున్న ఉపాయాలని, పరిష్కారాలని కూడా అందంగా సూచిస్తారు. ఉదాహరణకి ముగ్గేయాలనే తన కోరికని గోరింటాకు ద్వారా తీర్చుకొనే అక్కలా.. ..చాపరాయి మీద పేరు కన్నా మన పిల్లలని మనం పెట్టె కష్టం ఎక్కువని గీతోపదేశం చేసే మనిషిలా..

ఉదాహరణకి ” దస్తగిరి చెట్టు” కథలో ..తనను తన కెంతో ఇష్టమైన నానీ మా ఊరికి ఎందుకు పంపటం లేదని నిస్సహాయంగా అడుగుతుంటాడు ఒక పిల్లడు. తల్లి తండ్రులు, అమ్మమ్మ తాతలు కూడా కడు నిరుపేద మరియు రోజు వారీ కూలి కుటుంబాల్లో సెలవులకి పిల్లల్ని వాళ్ళకి నచ్చిన చోటుకి పంపటమంటే వాళ్ళు ఆర్ధికంగా భరించలేరు. సూచనలా వాళ్ళ అమ్మ వివరించేసరికి, దుఖంతో మొక్కుకుంటాడు తన కెంతో ఇష్టమైన దస్తగిరి మొక్కుల చెట్టుకి…ఏమనంటే లెక్క (డబ్బులు) లేకపోబట్టే కదా తను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లనిది. కావలసినంత లెక్క ఇమ్మని అల్లా ని అడుగుతాడు అమాయకంగా.. చెప్పుకోవటానికి చిన్న కథే అయిన ఒక తరపు జీవితం ఉంది అందులో.

ఇంక “పరదా” కథలో జేజి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆడపిల్లని పరదా లో పెంచామనే గోప్పతో,తక్కువ కట్నంతో పెళ్లి కానిచ్చేయాలనే కొడుకు,కోడలి నిస్సహాయత్వాన్ని గమనిస్తూనే, తాను మాత్రం అందులో ఇమాడలేనని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఈ జేజి నుంచి మనం నేర్చుకోవాల్సింది..ఒక తరానికి పై బడా ఉంది.  తమ పేదరికాన్ని కూడా పరదాలో దాచే విఫల ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకు జేజి తిరుగుబాటు, ఆవిడ స్వేచ్చా వాదం ఒక చెంప పెట్టులా తగలక మానదు.

ఇంక మిగతా కథల విషయాల కొస్తే..ఈ కథల సంపుటి రైతులు వాల్లెదుర్కొంటున్న కష్ట్రాల్ని, పేపర్లో లెక్కల్ల చదివి పక్కన పడేసే రైతు ఆత్మహత్యల వెనుక నేపధ్యం అంతా ఉంది. డైరెక్ట్ గా ఆత్మహత్య ఏ పాత్రా చేసుకోక పోయినా..మన గుండెలు పట్టేస్థాయి వాళ్ళ కష్టాల లెక్క చదివి.. వాటికి ప్రత్యక్ష ఉదాహరణాలు.. వ్యయానికి ఏ మాత్రం సాయం రాకపోయినా ప్రేమగా వ్యవసాయం చేసే రజాక్ మియా ,వెంకటరెడ్డి కథలు. మట్టిని నమ్ముకొని, దాన్ని అమ్ముకోలేక, నూకల కోసం ముష్టికి పోతూ..మట్టి కొట్టుకపోతున్న బ్రతుకులు వాళ్ళవి..

నాకు చాలా నచ్చిన కథలు..పలక పండుగ..అయ్యవారి చదువు.. తెలుగోళ్ళ దేవుడు… పిల్లల కథలే అయినా..భిన్న సంస్కృతిలో ఇమడలేని తనం..అయినా ఈ పోటి ప్రపంచం లో ఏ మాత్రం తగ్గకుండా..ధైర్యంగా అడుగు మున్డుకేయడంలోనే ఆయా వ్యక్తిత్వాల అస్తిత్వం, ఆకాంక్ష బయట పడతాయి. పిల్లల కిచ్చే బహుమతుల్లో కూడా మతమేమిటని ధైర్యంగా మొగుడ్ని నిలదీసి స్కూల్ మీద యుద్ధానికి పంపిస్తుంది జరీనా- తెలుగోళ్ళ దేవుడు అనే కథలో.

ఇంక అన్నిటికన్నా చెప్పాల్సిన కథ “జుమ్మా”- పని వత్తిడిలో, హైదరాబాధాల్లో ఉంటూ..ప్రతి శుక్కురారం మసీదు కేల్లలేని కొడుకు..ముసల్మానై పుట్టినందుకు తప్పక మసీదు కేళ్లాలని కొడుకుకి చిన్నప్పటినుంచి నూరి పోసి మాట తీసుకున్న తల్లి జుమ్మా మసీదు పేలుళ్ళ సంగతి వినగానే ..తన కొడుకు మసీదు కి వెళ్లనందుకు మనసులో సంతోషిస్తూ..కుముల్తుంది. ఈ నేపధ్యంలో చెప్పుకోవలసింది, తమ తమ ప్రదేశాల్లో తరాల తరబడి ఉంటూనే, చుట్టూ వున్నా వాళ్ళు తమని ఉగ్రవాదుల్లానో, ఆందోళనకారుల్లానో, చూస్తున్నా తట్టుకుంటూ బ్రతకాల్సి రావటం!! ఆ బాధ అనుభవించిన వాళ్లకి గాని తెలియదు. కాని అవి పాథకులకు అర్ధం అయేలా..కళ్ళకు కట్టేలా చూపిస్తారు షరీఫ్ గారు.

చదువుతున్నంత సేపు..మనం కూడా చాన్ పాషా అవుతాం, జేజి కోపంలా మండుతాం…అంజనాలతో… అలసినా ఆశ వదలని జమ్రూత్ తల్లి లా మారతాం.

సమీక్షకురాలిగా మాత్రమే కాదు రాయల సీమ ముసల్మాను జీవితాన్ని ఇంత దగ్గరగా వీక్షించేలా చేసిన షరీఫ్ గారికి ఇదే నా సద్దింపు..

మన మధ్యనే ఉండారు ఆళ్ళు…

ముగ్గేయని గడపల్లా..

మనం అర్ధం చేసుకోని.. అడ్డంగా అనుకునే పర్దాలా

ఇబ్బుడిబ్బుడే దిమాక్ లేని మనకి..

చల్లగా తెలిసే ఆకుపచ్చ ముగ్గులా..

మన మధ్యనే ఉండారు ఆళ్ళు..

ఎక్కడ పెట్టుకోవల సమజ్ గాని తెలుగోళ్ళ దేవుడ్లా..

ఎల్తీన్ తాగి సచ్చినా.. చెరపలేని చాప రాయి గీతలా

లెక్క కి రాని మొక్కులున్న దస్తగిరి చెట్టులా..

మౌనంగా..ముసల్మానులా..

మన మధ్యనే ఉండారు ఆళ్ళు..

బుడ్డి పెట్టుక సదువుకుంటూ..

సమాజం రెక్కల్లో కిక్కిరిసిన కోడి పిల్లల్లా..

ఏ కులమో చిక్కవడని దూదేకులోల్లలా..

తనకో కతుందని తెలియని …

అబ్బిలా.. తురకబ్బిలా…

మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ముసల్మాను జీవితాలను వాళ్ళ చుట్టూ ఉన్నా పరదాలను, వాళ్ళ వాతావరణాన్ని నిజయితీ గా చూపించే మంచి ప్రయత్నం.. ఈ జుమ్మా కథల సంపుటి. మూడు పదుల్లో ఉన్నా వయసులో తరాల కథలను ఇంత సరళంగా చెప్పటం షరీఫ్ గారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి కథలు ఈ రచయిత నుంచి ఆశించటం లో మనది ఒక అందమైన స్వార్ధం!!

కేంద్ర సాహిత్య అకాడమీ వారిచే యువ సాహితీ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్ పుస్తకం ” జుమ్మా’ పై చాలా కాలం క్రితం ” చినుకు’ పత్రికలో ప్రచురిచమైన నా రివ్యూ. షరీఫ్ గారికి బోల్డు బోల్డు అభినందనలతో

–సాయి పద్మ

Sai Padma ://IPR All Rights Reserved

2 thoughts on “జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష..

వ్యాఖ్యానించండి